‘నీ బాంచెన్ దొర’ అంటున్న ఉరవకొండ పోలీసులు.. అత్యుత్సాహంపై తీవ్ర విమర్శలు

అనంతపురం జిల్లా ఉరవకొండలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

Update: 2024-07-08 03:37 GMT

దిశ ప్రతినిధి, అనంతపురం: ఆయన మంత్రి కాదు. ఎమ్మెల్యే అసలే కాదు. కనీసం మాజీ ఎమ్మెల్యే కూడా కాదు. జస్ట్ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు మాత్రమే. పేరు ప్రణయ్ రెడ్డి. అధికార పార్టీ నాయకుడు కూడా కాని ఆ వ్యక్తి పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్వామిభక్తి చాటుకున్నారు. నీ బాంచెన్ దొర.. అన్నట్టు నడుచుకున్నారు. నిజానికి ఎస్పీ ఆదేశాలను కూడా తోసిరాజని ఉరవకొండలోని పార్టీ కార్యాలయానికి శనివారం ప్రణయ్ రెడ్డి విచ్చేశారు. ముందుగానే సమాచారం అందుకున్న పోలీసులు నియోజకవర్గంలోని వివిధ పోలీస్ స్టేషన్ లకు చెందిన సుమారు 200 మందిని మోహరింపజేశారు. ప్రణయ్ రెడ్డి వచ్చేలోగానే పోలీసులు వాహనాల రాకపోకలను నియంత్రించారు. వైసీపీ కార్యాలయానికి ఆయన వెళ్లే దారిలో ఎవరూ వాహనాలు నిలపకుండా చూశారు. ఇంతకూ ఆ స్వామి భక్తికి కారణం ఏమిటా అనుకుంటున్నారా? ఉరవకొండ ప్రాంతంలో విధుల్లో ఉన్న పోలీసులందరూ గత వైసీపీ హయాంలో నియమితులైన వారేనట. తమ పోస్టింగులకు మూల కారకులైన వారి పట్ల ఆ మాత్రం స్వామి భక్తి ప్రదర్శించకపోతే ఎలా? అని అనుకున్నట్టున్నారు. అంతే.. ముందూ వెనుకా ఆలోచించలేదు. తమ శాఖ ఉన్నతాధికారులను సైతం పక్కదారి పట్టించి మరీ స్వామి భక్తి ప్రదర్శించారు.

ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం

పట్టణంలోకి వైసీపీనాయకులు వస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తారని పోలీసు శాఖలోని కొందరు సిబ్బంది ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనివల్లనే పై స్థాయి అధికారులు ప్రణయ్ రెడ్డి భద్రత కోసం ఎక్కువమంది పోలీసులను కేటాయించినట్టు సమాచారం. వాహనంలో ప్రణయ్ రెడ్డి వెళుతున్నప్పుడు కొందరు పోలీసు సిబ్బంది దండాలు పెట్టడం పట్టణ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. టీడీపీ కూటమి పాలన లోనూ వైసీపీ నేతలకు రాచ మర్యాదలు కొనసాగుతు న్నాయంటే గత పాలకుల ప్రభావం అలాంటిదా? ప్రస్తుత పాలకులంటే భయం లేకపోవడం కారణమా? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. గతంలో తాడిపత్రికి అదనపు బలగాలను పంపే విషయంలో అప్పటి ఎస్పీ అమిత్ బర్దర్ ను తప్పుదోవ పట్టించిన అధికారులు ఆ తరువాత సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ అనుభవం నుంచి మన పోలీసులు గుణపాఠం నేర్చుకున్నట్టు లేరు. టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి.


Similar News