Kalyanadurgam: సైబర్ మోసం.. బ్యాంకు ఖాతా నుంచి డబ్బు మిస్
దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలకు సంబంధించిన డేటాను చోరీ చేసిన సైబర్ నేరగాళ్లు ఫేక్ మెసేజ్‌ల ద్వారా అకౌంట్ డబ్బులను లాగేసుకొని అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు..
దిశ, కళ్యాణదుర్గం: దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలకు సంబంధించిన డేటాను చోరీ చేసిన సైబర్ నేరగాళ్లు ఫేక్ మెసేజ్‌ల ద్వారా అకౌంట్ డబ్బులను లాగేసుకొని అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సైబర్ నేరగాళ్లు తొలుత ఫోన్‌కు మెసేజ్ పంపుతారు. తమ బ్యాంకు ఖాతాకు డబ్బులు జయ అయిందని, మెసేజ్ ఓపెన్ చేస్తే డీటేల్స్ వస్తాయని ఉంటుంది. దీంతో మెసేజ్ ఓపెన్ చేయగానే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు మాయం అవుతుంది. అలా సైబర్ నేరగాళ్లు వందలాది మందిని మోసం చేస్తున్నారు. అలా కంబదూరు, కుందుర్పి గ్రామాలకు చెందినఇద్దరు వ్యక్తులకు కూడా వాళ్ల అకౌంట్‌లో నగదు జమ అయిందని మెసేజ్‌లు వచ్చింది. అయితే వారు మేసేజ్ ఓపెన్ చేయకుండా మోసం నుంచి బయట పడ్డారు. ఆ విషయాన్ని మీడియాకు తెలిపారు. అయితే మరో వ్యక్తి మాత్రం డబ్బులు పోగొట్టుకున్నారు. తన ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ను ఓపెన్ చేయగానే బ్యాంక్ ఖాతా నుంచి లక్షా మూడు వేల రూపాయలు కట్ అయిటనట్లు తెలిసింది. దీంతో సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అలాగే కంబదూరుకు చెందిన ఒక వ్యక్తి ఖాతాకు రూ. 65 వేలు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. అయితే ఆ మెసేజ్ ఓపెన్ చేయకుండా సదరు వ్యక్తి మీడియాకు సమాచారం ఇచ్చారు. ఇలా సైబర్ నేరగాళ్లు ప్రతిరోజు వందల మందిని మోసం చేస్తున్నారు. దీంతో బాధితులు లబో దిబో అంటున్నారు. సైబర్ నేరగాళ్లపై ప్రభుత్వం, పోలీసులు గట్టి నిఘా ఉంచి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.