Anantapur: కీచక టీచర్‌కు జైలు శిక్ష, 10 వేల జరిమానా
అనంతపురం జిల్లాలో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన గురువుకు జిల్లా స్పెషల్ కోర్టు మూడేళ్లు జైలు శిక్ష విధించింది...
దిశ, డైనమిక్ బ్యూరో: అనంతపురం జిల్లాలో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన గురువుకు జిల్లా స్పెషల్ కోర్టు మూడేళ్లు జైలు శిక్ష విధించింది. గత ఏడాది గుత్తిలోని ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అమ్మాయి పట్ల సాలవేముల బాబు అనే టీచర్ అసభ్యంగా ప్రవర్తించారు. క్లాస్ రూంలోనే అమ్మాయిని బలవంతం చేయబోయారు. కీచకుడి చెర నుండి తప్పించుకొని జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో దిశ SOSకు కాల్ చేసి పోలీసులకు విద్యార్థిని కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై 354(D), పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. ఈ ఘటనపై పూర్తి ఆధారాలను స్పెషల్ పోక్సో కోర్టుకు దిశ పోలీసులు సమర్పించారు. దీంతో నిందితుడు సాలవేముల బాబుకు మూడేళ్లు జైలు శిక్ష, రూ.10వేలు స్పెషల్ కోర్టు జడ్జి జరిమానా విధించారు. తక్షణం స్పందించడంతో పాటు, నిందితుడికి శిక్ష పడేలా పనిచేసిన దిశ పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.