మీ ప్రేమకు నేను బానిసను.. మీ ప్రేమ‌ని వ‌రంగా పొందాను

Update: 2023-04-13 08:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ‘మీ బాధ‌లు విన్నాను.. స‌మ‌స్యలు చూశాను.. ప‌రిష్కార బాధ్యత నేను తీసుకుంటాను. యువగళం పాదయాత్రలో నా అడుగులో అడుగు వేసి మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధ‌న్యవాదాలు’ అని అనంతపురం జిల్లా ప్రజలకు నారా లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. యువగళం పాదయాత్ర అనంతపురం జిల్లాలో ముగిసిన సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘వ‌డ‌గాలుల తీవ్ర‌త నాపై అభిమానాన్ని కురిపించే జ‌నానికి అడ్డంకి కాలేదు. ప్రజాభిమాన‌మే బ‌ల‌మై, జ‌న‌మే ద‌ళ‌మై, తెలుగుదేశం నేత‌లే సార‌ధులై, కార్యక‌ర్తలే వార‌ధులై నా పాద‌యాత్రని విజ‌య‌వంతం చేశారు. అనంత‌పురం జిల్లా ప్రేమ‌ని వ‌రంగా అందించిన ప్రజ‌లు, తెలుగుదేశం నేత‌లు, కార్యక‌ర్తలు, అభిమానులు, మీడియా మిత్రులు, వ‌లంటీర్లు అంద‌రికీ నా హృద‌య‌పూర్వక ధ‌న్యవాదాలు’ అని లోకేశ్ లేఖలో తెలిపారు.

టీడీపీ ఆరంభించిన ప్రాజెక్టులు అర్ధంత‌రంగా ఆపేసి వైసీపీ స‌ర్కారు జిల్లాకి చేసిన అన్యాయం చూసి ఎంతో బాధ‌ప‌డ్డాను. రాయ‌ల‌సీమని ప‌ట్టిపీడిస్తున్న కరవును శాశ్వతంగా పారదోలాలని మహనీయుడు నందమూరి తారకరాముడి ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన హంద్రీనీవా సుజల స్రవంతి పనులను చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టించారు. తొలిదశ కాలువ పనులను పూర్తి చేయడంతో పాటు మల్యాల నుండి జీడిపల్లి దాకా ప్రధాన కాలువను వెడల్పు చేయడానికి వెయ్యి కోట్ల నిధులిచ్చి 70శాతం పనులను పూర్తి చేయించారు. ఈ జిల్లా మనవడినని హంద్రీనీవా కాలువను రెండు ద‌శ‌ల్లో పదివేల క్యూసెక్కులకు విస్తరిస్తామని మాయ హామీలిచ్చారు. విస్తరణ మాట విస్మరించి సాగుతున్న పనులను నిలిపివేశారు. నాలుగేళ్లలో హంద్రీనీవా పథకాన్ని నిర్లక్ష్యం చేసి అనంతపురం జిల్లాకు తీరని ద్రోహం చేశారు జ‌గ‌న్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం కొలువుతీరగానే హంద్రీనీవా విస్తరణ పనులను కొనసాగించడంతో పాటు ఆయకట్టుకు నీళ్లిచ్చే బాధ్యతను నేను తీసుకుంటాను’ అని లోకేశ్ హామీ ఇచ్చారు.

సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా

‘అనంతపురం జిల్లాలోనే అత్యంత వెనుకబడిన రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు సాగు, తాగు నీటిని అందించే జీడిపల్లి- భైర‌వానితిప్ప ప్రాజెక్టుకి చంద్రబాబు ప్రభుత్వం రూ.967కోట్లు మంజూరు చేసి పనులను ప్రారంభించింది. సీఎం అయ్యాక జగన్ రెడ్డి ఈ ప్రాజెక్టుని మూల‌న‌ప‌డేశారు. వైసీపీ పాలనలో అంతులేని నిర్లక్ష్యానికి గురైన భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాల తరలింపు పథకాన్ని పూర్తిచేసి ప్రజలు, రైతులను ఆదుకుంటామని హామీ ఇస్తున్నాను. ఉరవకొండ నియోజకవర్గంలో 50వేల ఎకరాలకు నీళ్లిచ్చే బిందుసేద్యం పథకాన్ని ఆరంభిస్తాం. అనంతపురం జిల్లాకు జీవనాధారమైన తుంగభద్ర ఎగువ కాలువ ఆధునికీకరణ పనులను పూర్తి చేస్తాం’ అని నారా లోకేశ్ మామీ ఇచ్చారు. అలాగే బొమ్మనహాల్ మండలంలో ఉంతకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయరును, మ‌డ‌క‌శిర బ్రాంచ్ కెనాల్, జీడిప‌ల్లి-పేరూరు ప్రాజెక్టును పూర్తి చేస్తాం. కియా అనుబంధ సంస్థ‌ల‌ని అనంత‌పురం జిల్లాకే తీసుకొచ్చి వేలాది మందికి ఉద్యోగ-ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తాం. రాయలసీమను హార్టికల్చ‌ర్ హబ్ గా మారుస్తాం అని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

అలాగే వైసీపీ భూబ‌కాసురులు క‌బ్జా చేసిన లేపాక్షి భూముల‌ని స్వాధీనం చేసుకుని, ఆ భూముల్లో ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటుకి కృషి చేస్తాం. జిల్లా లో ఉన్న చేనేత కార్మికులను ఆదుకుంటాం. ప్రత్యేక క్లస్టర్స్ ఏర్పాటు చేయడంతో పాటు మగ్గం ఉన్న వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం. టిడ్కో ఇళ్లు అందజేస్తాం, కామన్ వర్కింగ్ షెడ్లు ఏర్పాటు చేస్తాం. గతంలో అమలు చేసిన అన్ని సబ్సిడీలు అమలు చేస్తాం. చేనేత కు జీఎస్టీ ని రద్దు చేస్తాం. తాత ఎన్టీఆర్, హ‌రి మావ‌య్య‌, బాలా మావ‌య్య‌లు తాము పోటీచేసేందుకు మీ జిల్లానే ఎంచుకున్నారంటేనే మీ ప్రేమ, ఆప్యాయ‌త‌ల గొప్ప‌త‌నం తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ, నా కుటుంబంతోపాటు న‌న్నూ ఆత్మీయంగా ఆద‌రిస్తూ వ‌స్తోన్న‌ మీ అనంత‌పురం జిల్లాకి నేను రుణ‌ప‌డి ఉంటాను. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి, జిల్లాని అభివృద్ధి చేసి ఆ రుణం తీర్చుకుంటాను. అనంత‌పురం జిల్లాలో పాద‌యాత్ర‌ని ప్ర‌భంజ‌నం చేసిన మీ ప్రేమ‌కి స‌దా బానిస‌ను. యువ‌గ‌ళాన్ని జ‌న‌స్వ‌రం చేసిన మీ అభిమానానికి శిర‌సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను’ అని లోకేశ్ లేఖలో పేర్కొన్నారు.


Similar News