వైఎస్ జగన్ ప్రభుత్వంపై అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసల వర్షం కురిపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసల వర్షం కురిపించారు.రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని, కార్పొరేటు స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోవని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నన్ని సదుపాయాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. అంబటి రాయుడు తెనాలి నియోజకవర్గం సంగం జాగర్లమూడిలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. అనంతరం అంబటి రాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని వెల్లడించారు. విద్యా,వైద్య రంగాలపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అద్భుతమని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కొనియాడారు.
జగనన్న ఆరోగ్య సురక్ష పథకం అద్భుతం
ప్రభుత్వ పాఠశాల్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని అంబటి రాయుడు అన్నారు. విద్యారంగంలో సీఎం జగన్ తీసుకున్న చర్యలపై ప్రశంసలు వర్షం కురిపించారు. మధ్యాహ్నం భోజన పథకం ద్వారా పిల్లలకు రుచికరమైన ఆహారం ఇస్తున్నారని... ఒకవైపు విద్యతోపాటు మరోవైపు పౌష్టికాహారం అందించడం వల్ల విద్యార్థుల భవిష్యత్‌కు పెద్దపీట వేస్తోందని తెలుస్తోందని అన్నారు. మరోవైపు వైద్యరంగంలో వైసీపీ ప్రభుత్వం కనబరుస్తున్న తీరు చాలా బాగుందని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయని... వైద్య ఆరోగ్య రంగంలో ఏపీకి ధీటైన రాష్ట్రం మరొకటి లేదని తాను భావిస్తున్నట్లు తెలిపారు.‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం చాలా గొప్పదన్న ఆయన ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మందికి వైద్య సేవలందించారని కితాబిచ్చారు. మరోవైపు అన్నదాతనలు కూడా వైసీపీ ప్రభుత్వం అక్కున చేర్చుకుంటుందని చెప్పుకొచ్చారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని క్రికెటర్ అంబటి రాయుడు చెప్పుకొచ్చారు. ఇకపోతే ఇటీవలే క్రికెట్‌కు అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం ఏపీలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలపై తనదైన తీరులో స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పలుమార్లు భేటీ అయ్యారు. దీంతో అంబటి రాయుడు త్వరలోనే రాజకీయాల్లో చేరబోతున్నారని... వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.