రాజకీయ లబ్ది కోసమే ఈ ఎత్తుగడలన్నీ
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని ఈనెల 23న అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన దెబ్బకు అధికార వైసీపీ దిమ్మదిరిగినట్లుంది. ఏం చేయాలో దిక్కుతోచనట్లుంది. అందుకే అడగని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసేశారు. తమను ఎస్సీల్లో చేర్చాలని ఎప్పటినుంచో అడుగుతున్న రజకుల గురించి మాత్రం ప్రస్తావించడం లేదు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని మరో తీర్మానం చేశారు. దీంతో గిరిజనులు ప్రభుత్వంపై కన్నెర్రజేస్తున్నారు. ఇలా ప్రతి అంశాన్నీ రాజకీయ ప్రయోజనం దృష్టిలో ఆలోచించడం వల్లే అధికార పార్టీకి కోలుకోలేని విధంగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. సీఎం జగన్కు ఇలాంటి సలహాలు ఎవరిస్తున్నారో.. లేక ఆయన సొంత నిర్ణయాలో అర్థం కావడం లేదు. అసెంబ్లీలో చేసిన రెండు తీర్మానాలతో లాభం కన్నా నష్టమే ఎక్కువని రాజకీయ పరిశీలకుల అంచనా.
దిశ, ఏపీ బ్యూరో: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని ఈనెల 23న అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. సాధారణంగా ఎస్సీలు క్రైస్తవ మతంలో ఉన్నా వాళ్లు రిజర్వేషన్సౌకర్యాన్ని అనుభవిస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం. రాష్ట్ర జనాభాలో క్రైస్తవులు సుమారు 1.3 శాతం ఉండొచ్చు. జాతీయ సగటు 2.4 శాతానికన్నా తక్కువే. రాష్ట్రంలోని దాదాపు 11 లక్షల మంది క్రైస్తవుల్లో కమ్మ, రెడ్డి, కాపు, ఇతర బీసీ, ఎస్టీ కులాల వాళ్లు మూడు లక్షల మంది ఉంటారు. మిగతా 8 లక్షల మంది మాత్రమే దళిత క్రైస్తవులు. వీళ్లలో చాలా మంది ఎస్సీ హోదానే అనుభవిస్తున్నారు. చర్చిలకు అంకితమైన కొన్ని కుటుంబాలు మాత్రమే ఎస్సీ హోదాను పట్టించుకోలేదు.
అందరిదీ అదే తీరు..
తమాషా ఏమిటంటే కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా క్రైస్తవుల ఓటు బ్యాంకు కోసం ఎస్సీ హోదా గురించి ప్రస్తావిస్తుంటాయి. గత టీడీపీ ప్రభుత్వం అచ్చు ఇలాగే 2019 ఫిబ్రవరి 7న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అంతకముందు వైఎస్ హయాంలో 2009 ఆగస్టు 25న సేమ్టు సేమ్ఇలాగే తీర్మానం చేసి పంపారు. ఇంకా అంతకముందు ప్రభుత్వాలు కూడా ఇలాగే చేశాయి. నేషనల్ఫ్రంట్హయాంలో కేంద్ర కమిషన్వేశారు. యూపీఏ ప్రభుత్వంలో వేసిన జస్టిస్రంగనాధ మిశ్రా కమిషన్ కు కాలం చెల్లింది. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలో జస్టిస్బాలకృష్ణన్కమిషన్ఉనికిలో ఉంది. మరోవైపు సుధీర్ఘ కాలంగా సుప్రీం కోర్టులో దీనిపై విచారణ కొనసాగుతోంది. అయినా తాము దళిత క్రైస్తవుల పక్షపాతమని చాటుకునేందుకు ఇలాంటి తీర్మానాలు చేసి పంపిస్తుంటారు. నిజానికి దళిత క్రైస్తవులకు ఏదైనా చేయాలని ప్రభుత్వం భావిస్తే అన్యాక్రాంతమవుతున్న చర్చిల ఆస్తులను పరిరక్షించాలి. ప్రత్యేక అధికారులను నియమించి ఆక్రమణల నుంచి విడిపించాలని క్రైస్తవులు అడుగుతున్నారు. ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. ఇలా తీర్మానాలతో మభ్యపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
రజకులు మొత్తుకుంటున్నా..
తమను ఎస్సీల్లో చేర్చాలని రజకులు ఎప్పటినుంచో డిమాండ్చేస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా అణచివేతకు గురవుతున్న తమను ఎస్సీల్లో చేర్చడం ఆవశ్యమంటూ ప్రభుత్వాలకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు. ఎన్నోచోట్ల రజకులపై దాడులు జరుగుతున్నాయి. ఎస్సీల్లో చేర్చాలని రజక సంఘాలు ఆందోళనలు చేసినా ప్రభుత్వాల చెవికెక్కడం లేదు. బీసీ జనాభాలో రజకులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. ఒక నియోజకవర్గంలో గెలుపోటములను శాసించే స్థాయిలో మాత్రం వాళ్ల ఓట్లు ఉండవు. అందుకే వాళ్లకు ఇస్తామన్న ఎమ్మెల్సీ హామీని నెరవేర్చలేదు. ఇక ఎస్సీ హోదా కల్పిస్తామని కనీసంగా కూడా ప్రస్తావించడం లేదు. అదే వాల్మీకి బోయలు సీమలోని కొన్ని నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఎస్టీల్లో చేర్చడమనేది రాష్ట్ర పరిధిలోని అంశం కాకున్నా ఇలా కంటితుడుపుగా తీర్మానాలు చేస్తుంటారు.
ఎస్టీలు వైసీపీకి దూరమయ్యే చాన్స్..
అధికార పార్టీకి బోయలు దగ్గరవుతారో లేదో తెలీదు. ఈపాటికే పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ఎస్టీలు దూరమయ్యే అవకాశముంది. అలాగే ఎస్సీల్లో కలపాలని అడుగుతున్న రజకులను వదిలేశారు. ఎమ్మెల్సీ హామీని విస్మరించారు. దీంతో రజకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోవైపు తమ చర్చిల ఆస్తులను కాపాడండి మహాప్రభో అని క్రైస్తవులు ఆక్రోశిస్తుంటే.. దళిత క్రైస్తవులు అడగని ఎస్సీ హోదా గురించి ప్రభుత్వం హడావుడి చేస్తోంది. ఇలా ఏ వర్గానికీ ఎలాంటి ప్రయోజనం కల్పించకున్నా పాలకులు పనికిమాలిన నిర్ణయాలతో సెల్ఫ్గోల్చేసుకుంటున్నారు. ఈ పరిణామాలతో పార్టీకి డ్యామేజీ జరగడం ఖాయమని అధికార పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.