వైఎస్ఆర్ అవార్డులు అందుకున్న వారంతా అసామాన్యులు, మనజాతి సంపద: సీఎం వైఎస్ జగన్
విజయవాడ ఏ– కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక కన్నులపండువగా జరిగింది.
దిశ, డైనమిక్ బ్యూరో : విజయవాడ ఏ– కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక కన్నులపండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుల– 2023 ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరించి నేటికి 67 సంవత్సరాలైంది. వరుసగా ఈరోజుకు లెక్కేసుకుంటే ఇది మూడో సంవత్సరం ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు. మన రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో దశాబ్దాలుగా సుసంపన్నం చేసిన మహనీయులను గౌరవిస్తూ వైఎస్ఆర్ అవార్డులతో సత్కరించే ఈ సంప్రదాయం మూడు సంవత్సరాలుగా చేస్తున్నాం. మన సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ వివిధ రంగాల్లో ఆకాశమంత ఎదిగినా సామాన్యులుగానే ఒదిగి ఉన్న అసామాన్యులకు ఇస్తున్న అవార్డులు ఇవి అని సీఎం వైఎస్ జగన్ కొనియాడారు.
27 మందికి అవార్డులు
వైఎస్ఆర్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది 27 మందికి వైఎస్ఆర్ అవార్డులతో సత్కరిస్తున్నట్లు తెలిపారు. ఇందులో నలుగురికి అచీవ్‌మెంట్, 23 మందికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ప్రదానం చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. తెలుగుతనానికి, తెలుగు మాటకు, తెలుగు వాడి గుండె ధైర్యానికి మన పల్లెలు, మన పేదలు, మన రైతుల మీద మమకారానికి, మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొడియారు. అందుకే ప్రతీ ఏడాది ఆయన పేరుతో రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అవార్డులు ప్రదానం చేస్తుంది అని సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ హయాంలో వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం ఇలా ఏ రంగాన్ని తీసుకన్నా అంతకు ముందున్న చరిత్ర గతిని మారుస్తూ ఎన్నో ముందడుగులు పడిన పరిస్థితులు మనమంతా చూసినవేనని సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. ఇలాంటి రంగాల్లోనే మన వ్యవసాయానికి, మన చేనేతకు, మన తప్పెటగుళ్లకు, మన జానపదానికి, మన రంగస్థలానికి, మన అభ్యుదయ వాదానికి, మన హేతు వాదానికి... సాటి మనుషులకు చేస్తున్న సేవలకు ఇలా పలు రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న గొప్ప వ్యక్తులకు ఈ ఏడాది అవార్డుల్లో చోటు దక్కింది అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
వీరంతా మన జాతి సంపద
వైఎస్ఆర్ అవార్డులు అందుకుంటున్నవారు అంతా కూడా తమ రంగాల్లో వారి జీవితాన్ని అర్పించిన వారు, మన వారసత్వాన్నితమ భుజాల మీద మోసిన వారు అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. వీరంతా మన జాతి సంపద అని కొనియాడారు.ఈరోజు సమాజం ఇచ్చిన గుర్తింపు ఆధారంగా ప్రదానం చేస్తున్న ఈ అత్యున్నత అవార్డుల్లో చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఈ మూడు సంవత్సరాల్లో సామాజిక న్యాయం సంపూర్ణంగా వర్ధిల్లింది. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.