విశాఖ నుంచే పరిపాలన.. డేట్ ఫిక్స్!

విశాఖ నుంచి పాల‌న‌కు సీఎం జ‌గ‌న్ సిద్ధమైపోయారా?

Update: 2023-03-14 12:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖ నుంచి పాల‌న‌కు సీఎం జ‌గ‌న్ సిద్ధమైపోయారా? రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో విశాఖకు షిఫ్ట్ అవుతారా? అసెంబ్లీ సమావేశాలు, జీ-20 సదస్సు అనంతరం పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం పూర్తయ్యాక ఇక రాజధాని తరలింపుపై ఫోకస్ పెట్టారా? అన్ని పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వచ్చేసి ఎన్నికల అస్త్రం కోసం పరితపిస్తున్న సమయంలో సీఎం జగన్ విశాఖ రాజధానిని ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకోనున్నారా? అందుకే జూలై నెలలో ముహూర్తం అని ప్రకటించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జూలైలో వైజాగ్‌కి మకాం మార్చబోతున్నట్లు సీఎం జగన్ ప్రకటించేశారు.

అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయ‌మ‌ని చెబుతున్న వైఎస్ జగన్ ఇక విశాఖ కేంద్రంగా పాల‌న ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. దీనికి త‌గ్గట్లుగానే సీఎం క్యాంపు కార్యాల‌యం కోసం విశాఖ‌లో ఇప్పటికే పోర్ట్ గెస్ట్ హౌస్‌ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలు, విశాఖ‌లో జీ-20 సద‌స్సులు పూర్తైన తర్వాత ఏప్రిల్ నెల నుంచి విశాఖకు షిఫ్ట్ కావాలని ప్రయత్నించారు. అయితే అందుకు తక్కువ సమయం ఉండటంతో ఇబ్బందికరంగా మారింది. సీఎం కార్యాల‌యంతో పాటు ఆయ‌న‌కు అనుబంధంగా ఉండే జీఏడీ కూడా విశాఖ త‌ర‌లించాల్సిన పరిస్థితి ఉంది. ఇందుకు సమయం పట్టడంతో అందుకు జూలైను ఫిక్స్ చేశారని తెలుస్తోంది.

చెప్పాడంటే.. చేస్తాడంతే..

చెప్పానంటే చేస్తానంతే అన్నట్లు సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి వెనక్కి తగ్గడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని ఇప్పటికే పలుమార్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నారో కూడా సీఎం జగన్ స్పష్టం చేశారు. జూలై నెలలో విశాఖకు షిఫ్ట్ అవ్వబోతున్నట్లు సీఎం జగన్ ప్రకటించేశారు.

మూడు రాజధానుల అంశంపై ఒకసారి కమిట్ అయిన తర్వాత మళ్లీ మాట తప్పడం మడమ తిప్పడం ఉండవని నిరూపించారు. మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ ఢిల్లీ, విశాఖపట్టణంలోని ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 వేదికగా బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. ఒకవైపు అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పటికీ రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నా తగ్గేదేలే అంటున్నారు. ఇక జూలై నెలలో షిఫ్ట్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఏకంగా కేబినెట్ భేటీలో స్పష్టం చేయడంతో ఇక రాజధాని తరలింపునకు ముహూర్తం కుదిరినట్లేనని తెలుస్తోంది.

నివాసంగా పోర్ట్ గెస్ట్‌హౌస్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జూలై నుంచి విశాఖ నుంచి పరిపాలన కొనసాగించాలని నిర్ణయించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం సీఎం నివాసంపై ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పోర్ట్ గెస్ట్‌హౌస్‌ను తాత్కాలిక నివాసంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరికల్లా రిషికొండలో సీఎం క్యాంపు కార్యాలయానికి సంబంధించిన పనులు పూర్తి చేసుకుని అందుబాటులోకి వస్తుందని ఈ పరిణామాల నేపథ్యంలో అప్పటి వరకు పోర్ట్ గెస్ట్‌హౌస్ నుంచే పాలన చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే విశాఖ నుంచి రెండు రోజులు మాత్రమే పరిపాలన కొనసాగిస్తారని తెలుస్తోంది. ప్రతి సోమ, మంగళవారం విశాఖ‌లోనే సీఎం జగన్ అందుబాటులో ఉంటారని.. అలాగే ప్రతీ బుధవారం పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రాంతంలో సీఎం జగన్ పర్యటిస్తారని తెలుస్తోంది. అనంతరం గురువారం ఉదయం విశాఖకు వెళ్లి అక్కడ నుంచి రాత్రికి అమరావతి చేరుకుంటారని తెలుస్తోంది. శుక్ర, శని, ఆది ఈ మూడు రోజలు సీఎం జగన్ అమరావతిలోనే ఉంటారని తెలుస్తోంది.

పక్కా వ్యూహం

జూలై నుంచి విశాఖకు రాజధాని తరలింపు అనేది పక్కా వ్యూహంగా తెలుస్తోంది. అప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్తాయి. అంతేకాదు ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు ఎన్నికల అస్త్రాలను వెతికే పనిలో ఉంటాయి. అలాంటి సందర్భంలో సీఎం జగన్ తన అమ్ముల పొదలో నుంచి విశాఖ రాజధాని అనే అంశాన్ని తెరపైకి తెస్తారని తెలుస్తోంది. దీన్ని ఎన్నికల ప్రధాన అస్త్రంగా మార్చుకోబోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో బలపడుతుందన్న సర్వే నేపథ్యంలో అక్కడ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి టీడీపీకి గండికొట్టాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఉభయగోదావరి జిల్లాలలో జనసేన పార్టీకి మంచి ఓటింగ్ శాతం ఉంది. ఈ నేపథ్యంలో పక్కనే రాజధాని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వారి బ్రెయిన్ వాష్ చేసి జనసేనకు దూరం చేయాలని వైఎస్ జగన్ వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే సీఎం వైఎస్ జగన్ జూలైను ముహూర్తంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ రాజధాని తరలింపు అనేది వైసీపీ ఎన్నికల్లో కీలకంగా మారబోతుందని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

Tags:    

Similar News