TDP Strong Counter: చంద్రబాబు సరే.. జగన్ కోడి కత్తి గాయం సంగతేంటి..?
ఏపీలో ఇప్పుడు చంద్రబాబు హెల్త్ రిపోర్ట్స్‌పై మాటల యుద్ధం నడుస్తోంది. ..
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఇప్పుడు చంద్రబాబు హెల్త్ రిపోర్ట్స్‌పై మాటల యుద్ధం నడుస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్, బెయిల్, ఆరోగ్య సమస్యలు, కంటి చికిత్స వంటి అంశాలు తెలిసినవే. అయితే తాజాగా బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టులో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు చంద్రబాబు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన రిపోర్టులను కూడా జత చేశారు. ఈ పిటిషన్లపై సీఐడీ, చంద్రబాబు తరపు లాయర్లు ధర్మాసనం ఎదుట తమ వాదనలు వినిపించారు. దీంతో చంద్రబాబు బెయిల్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలా..? వద్దా దానిపై ధర్మాసనం ఎప్పుడైనా తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.
అయితే హైకోర్టుకు చంద్రబాబు అందజేసిన హెల్త్ రిపోర్ట్స్‌పై టీడీపీ, వైసీపీ నాయకులు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చంద్రబాబు మరికొంత కాలం బయట ఉండేందుకు వీలుగా డాక్టర్లు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. అంతేకాదు హెల్త్ రిపోర్ట్స్, వైద్యం చేసిన డాక్టర్లపై అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నా.. అనారోగ్యంగా ఉన్నట్లు వైద్యులు మెడికల్ రిపోర్టు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వైద్యులు పరిధిదాటి వ్యవహరిస్తున్నారని, రాజకీయాల నాయకుల్లా ఉన్నారని ఆరోపించారు. వైద్యులను చంద్రబాబు మేనేజ్ చేశారనడానికి మెడికల్ రిపోర్టులే నిదర్శనమని సజ్జల వ్యాఖ్యానించారు.
మరోవైపు టీడీపీ నేతలు సైతం సజ్జలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. గతంలో జరిగిన కొన్ని సంగతులను గుర్తు చేస్తూ విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుకు అనారోగ్య సమస్యలు ఉండటం వల్లే డాక్టర్లు రిపోర్టులు ఇచ్చారని తెలిపారు. కానీ వైఎస్ జగన్, వైఎస్ అవినాశ్ రెడ్డి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. సైకో పాలనలో సత్యం మరుగున పడుతుందని,. అసత్యం అందలం ఎక్కుతుందని అంటున్నారు. సజ్జల లాంటి వ్యక్తి అబద్ధాలు చెప్పడం విచిత్రమేమీ కాదని ఎద్దేవా చేస్తున్నారు.చంద్రబాబుకు బెయిల్ రావడం సీఎం వైఎస్ జగన్‌కు, సకల శాఖల సలహాదారుడు సజ్జలకు ఇష్టం లేదని విమర్శలు చేస్తున్నారు. పద్మవిభూషణ్ గ్రహీత, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని, ఏఏజీ ఆస్పత్రిని తప్పుబట్టే స్థాయి సజ్జలకు లేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఎలాంటి ప్రత్యేక ఉందని అక్రమాస్తుల కేసులో జగన్ మోహన్ రెడ్డి విచారణకు హాజరుకావడం లేదో సజ్జల ఒక్కసారి చెప్పాలని డిమాండ్ చేశారు. కోడికత్తి గాయానికి ఆంధ్రాలో వైద్యం చేసేవారు లేరని, ఆనాడు జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్‌కు వెళ్లారా అని నిలదీస్తున్నారు. బాబాయ్ వైఎస్ వివేకానందారెడ్డి హత్య నుంచి అవినాశ్ రెడ్డిని, కోడికత్తి కేసు నుంచి తనను రక్షించుకునేందుకు ఇంకెన్నాళ్లు నాటకాలు ఆడుతారో చెప్పాలని నిలదీస్తున్నారు.
ప్రస్తుతం ఈ రెండు పార్టీల నేతల మాటలతో అసలు సమస్యలు పక్కదారి పడుతున్నాయని పలువురు ప్రజలు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబుకు బెయిల్ సంగతి కంటే రాష్ట్రాభివృద్ధిపై అన్ని పార్టీలు దృష్టి సారించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కొంతకాలంగా చంద్రబాబు అరెస్ట్, బెయిల్ పై రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పటికైతే టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరి తదుపరి పరిణామాలు ఏవిధంగా ఉంటాయో చూడాలి.