AP News : ఏపీలో టీచర్స్ డే లేనట్లే.. ఉపాధ్యాయ సంఘాలు సంచలన నిర్ణయం
దేశ చరిత్రలోనే తొలిసారిగా ఉపాధ్యాయ సంఘాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. రాష్ర్టంలో ఈ ఏడాది ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం
దిశ, ఏపీ బ్యూరో: దేశ చరిత్రలోనే తొలిసారిగా ఉపాధ్యాయ సంఘాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం జరపరాదని నిర్ణయించాయి. ప్రభుత్వ తీరుకు నిరనసగా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ ప్రకటించింది. ఉపాధ్యాయుల్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగానే నిర్ణయం తీసుకున్నట్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.
పట్టించుకోవడం లేదు
ఉపాధ్యాయ సంఘాలు గత కొంతకాలంగా తమ సమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతున్నాయి. పలు దఫాలుగా చర్చలు కూడా జరిపాయి. అయినా ప్రభుత్వం మాత్రం ఫేస్ యాప్, బయోమెట్రిక్ హాజరుతో పాటు పలు నిర్ణయాలతో వారిని టార్గెట్ చేస్తున్నట్లు భావిస్తున్నాయి. తాజాగా విజయవాడలో చేపట్టిన మిలియన్ మార్చ్ కార్యక్రమానికి వారు హాజరవుతారనే భయాలతో ముందస్తు అరెస్టులు, బైండోవర్లకు కూడా దిగింది. దీంతో ఉపాధ్యాయ సంఘాలు ఈ సారి కీలక నిర్ణయం తీసుకున్నాయి.
సత్కారాలు మాకొద్దు
ఈ ఏడాది ఈ నెల 5న జరగాల్సిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు ప్రభుత్వ సత్కారాలు, సన్మానాలు తిరస్కరణకు రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) పిలుపునిచ్చింది. ఉపాధ్యాయులను ప్రభుత్వం అవమానిస్తోందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరేషన్‌లో సంఘాలు పేర్కొన్నాయి. అక్రమ నిర్బంధాలు, బైండోవర్లను తీవ్రంగా పరిగణిస్తున్నామని, సొంత ఫోన్లలో ఫొటోలతో హాజరు వేసేలా ఒత్తిడి చేస్తున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. సీపీఎస్ రద్దు హామీని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ప్రభుత్వ చర్యలకు నిరసనగానే టీచర్స్ డే బాయ్ కాట్ నిర్ణయం తీసుకున్నామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
అసలు సమస్య అదే..
ఈ నెల1న సీపీఎస్ రద్దు కోసం కొన్ని ఉద్యోగ సంఘాలు మిలియన్ మార్చ్ ప్రటించాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కొందరిని బైండోవర్‌లోకి తీసుకుంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు సీరియస్ అయ్యాయి. ఉపాధ్యాయులపై అక్రమ కేసులు, బైండోవర్లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నామని పేర్కొన్నాయి. ప్రభుత్వం సొంత ఫోన్లలో ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా హాజరు వేసేలా ఒత్తిడి చేస్తున్నారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బందికి కలిపి పాఠశాల విద్యాశాఖ ఒకే హాజరు యాప్‌ను తీసుకొచ్చింది. స్కూళ్ల ప్రాంగణంలో మాత్రమే పని చేసే ఈ యాప్‌ను ఈ నెల 1 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉపాధ్యాయులు తమ ఫోన్లలో ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఉదయం 9 గంటల్లోపు ఫేస్ రికగ్నిషన్‌తో హాజరు వేయాల్సి ఉంటుంది. సమయం దాటితే ఆ రోజు సెలవుగా పరిగణిస్తారు. సెలవులు కూడా ఈ యాప్‌లోనే ఆప్లై చేసుకోవాలి. విద్యార్థులకు టిక్ మార్క్ హాజరును ఉదయం 10 గంటల్లోపు యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అన్ని పథకాలకు ఈ హాజరునే ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నది. ఎన్నడూ లేని ఈ విధానాల పట్ల ఉపాధ్యాయ సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ఈ నిర్ణయం టీచర్లను మరింత ఒత్తిడిలోకి నెట్టడమే అని వారు ఆరోపిస్తున్నారు.
అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం
మరోవైపు ప్రభుత్వం ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా గురు పూజోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించింది. వివిధ హోదాల్లో పని చేస్తున్న 58 మంది టీచర్లకు ఈ అవార్డులను ప్రకటించారు. అవార్డులను స్వీకరించడానికి ఆయా టీచర్లు ముందుకు వస్తారా లేదా అన్నది ఆశక్తికరంగా మారింది. గురు పూజోత్సవాని బైకాట్ చేస్తున్నామంటూ ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన పిలుపుపై మాత్రం ఇంతవరకూ.. విద్యాశాఖ గానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. అయితే, తాము టీచర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వం అని లేనిపోని అపోహలకు గురి కావొద్దని గతంలో చెప్పిన దానికే కట్టుబడి ఉన్నట్టు మాత్రం ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : ప్రభుత్వం టీచర్ల పట్ల వ్యవహరిస్తోన్న తీరుకు నిరసనగా టీచర్స్ డే బాయ్ కాట్