Annavaram: అన్నవరం సత్యదేవుడి ఆలయంలో అపచారం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుడి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. ...

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుడి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. నిత్యం వేలాది భక్తులు వచ్చే ఈ టెంపుల్ గదుల్లో ఖాళీ మద్యం బాటిళ్లు దర్శనమిచ్చాయి. భక్తుల కోసం కొండపైనే కాదు.. కింద కూడా కాటేజులు ఉన్నాయి. అయితే వీటిని ఆన్ లైన్‌లోనూ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో భక్తులు ఈ కాటేజుల్లో స్టే చేసి స్వామివారిని దర్శించుకుని తిరిగి స్వగ్రామాలకు వెళుతుంటారు. అయితే ఈ గదులను ఈవో ఆకస్మికంగా సోదాలు చేశారు. సత్యనికేతన్‌లో మద్యం ఖాళీ బాటిళ్లు కనిపించాయి. దీంతో మందుబాబులు ఎవరా అని ఆరా తీస్తున్నారు.
ఇదిలా ఉంటే సత్యనికేతన్ సత్రంలోని ఏడు గదుల్లో ఆలయ సిబ్బంది, బందోబస్తు పోలీసులు కొద్దిరోజులుగా ఉంటున్నారు. వీరే గదుల్లోకి మద్యం బాటిళ్లు తెచ్చి ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు సీరియస్‌గా దృష్టి పెట్టారు. గదుల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు పూర్తిగా దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఈవో ఆదేశించింది. అనంతరం చర్యలు తీసుకుంటామని ఈవో పేర్కొన్నారు.