దప్పిక తీరేదెలా ?

అధికార పార్టీ సర్పంచుల తీరుతో వేసవికి ముందే గ్రామాల్లో తాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. సర్పంచుల ఇష్టారాజ్యం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు.

Update: 2023-03-12 03:31 GMT

దిశ, కర్నూలు ప్రతినిధి: అధికార పార్టీ సర్పంచుల తీరుతో వేసవికి ముందే గ్రామాల్లో తాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. సర్పంచుల ఇష్టారాజ్యం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజక వర్గాలు, 57 మండలాలు, 921 రెవెన్యూ గ్రామాలు, 993 పంచాయతీలు ఉన్నాయి. 40.52 లక్షల జనాభా, 9.06 లక్షల హెక్టార్ల సాగు భూమి ఉంది. మంచినీటి కోసం నిధులు కేటాయిస్తున్నా పనులు చేయకుండా బిల్లులు పెట్టుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చాలా మున్సిపాలిటీల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. అధికార పార్టీకి సర్పంచులు ప్రజా సమస్యలు గాలికొదిలేశారు.

నీరు తగ్గితే వెలు‘గోడే’

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని జానాల గూడెంలో దాదాపు 80కి పైగా కుటుంబాలున్నాయి. ఇక్కడ 2 వేల లీటర్ల ట్యాంకు ఏర్పాటు చేశారు. ఆరు బోర్లుంటే నాలుగు బోర్లకు ఎలాంటి మోటార్లు బిగించలేదు. రెండు నెలల క్రితం పైపులు తీసి పక్కన పడేశారు. అలాగే మరో బోరును ఆర్డీటీ సంస్థ మరమ్మతు చేయించేందుకు 6 నెలల క్రితం ముందుకొచ్చినా సర్పంచ్ బాల ఎల్లయ్య ఈ పని తాను చేయిస్తానని నమ్మబలికి గూడెం వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి

జిల్లాలో 7 నియోజకవర్గాలు, 489 గ్రామ పంచాయతీలు, 3.67 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. తెలుగు గంగ లక్షల ఎకరాలకు సాగు నీరు, వందల గ్రామాలకు తాగు నీరు అందిస్తుంది. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద బండి ఆత్మకూరు, వెలుగోడు, మహానంది మండలాల్లోని 14 గ్రామాలతోపాటు ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాలకు తాగు నీరు అందించనున్నారు. కాల్వలకు మరమ్మతులు చేపట్టకపోతే కొత్తపల్లి మండలంలోని పెద్ద గుమ్మడాపురం, గువ్వలకుంట్ల, ఎర్రమఠం, ముసలిమడుగు, సిద్దేశ్వరం, కపిలేశ్వరం, మాడుగుల, జానాల గూడెం, బలపాల తిప్ప, కొక్కెరంచ, జడ్డు వారి పల్లె వంటి దాదాపు 20 గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఎర్ర మఠం, జానాల గూడెం వంటి ప్రాంతాల్లో తీవ్ర నీటి సమస్య ఉంది. అలాగే ఆళ్లగడ్డ, చాగలమర్రి, శిరివెళ్ల, రుద్రవరం, నందికొట్కూరు, పాములపాడు, మిడ్తూరు వంటి మండలాల్లోని అనేక గ్రామాల్లో నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

దయనీయం..పశ్చిమ ప్రాంతం

కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో మరీ దయనీయ పరిస్థితులు దాపురించాయి. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, పత్తికొండ, పాణ్యం నియోజక వర్గాల పరిధిలో 721 గ్రామాలున్నాయి. 32 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్) ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణకు ప్రతి ఏటా నిర్వహణకు ప్రతి ఏటా రూ.41.63 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వేసవిలో 107 గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని ఇంజినీర్లు గుర్తించారు. భూ గర్భ జలాలు అడుగంటి 106 బోర్లు మరమ్మతు చేయాలి. నీటి ఎద్దడి నివారణకు రూ.8.08 కోట్లు అవసరమని గుర్తించారు.

జిల్లాలో నీటి సమస్య లేదు

నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా నీటి సమస్య లేదు. కొత్తపల్లి మండలంలోని జానాల గూడెం, ఎర్ర మఠం, ముసలిమడుగు, సిద్దేశ్వరం, బలపాల తిప్ప వంటి ప్రాంతాల్లో నీటి సమస్య ఉందని తమ దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని ఎంపీడీఓకు సూచించి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం. అవసరమైన చేతి పంపులకు మరమ్మతులు చేయిస్తున్నాం:- శ్రీనివాసులు, డీఎల్పీవో, నంద్యాల

Tags:    

Similar News