‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమం వెనుక భారీ స్కెచ్.. సీఎం వ్యూహం ఫలించేనా..?

Update: 2023-11-18 01:51 GMT

‘వై ఏపీ నీడ్స్ జగన్​’ అనేది పార్టీ చేయాల్సిన పని. దీన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేశారు. దీని వెనుక సీఎం జగన్​స్కెచ్​ఏంటనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రచార కార్యక్రమానికి పెద్దగా ఖర్చుకాకున్నా ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనేట్లు చేయడం వల్ల ఆ వర్గాల్లో అసంతృప్తి లేదని సంకేతాలు ఇవ్వదల్చుకున్నారా..! పార్టీ కార్యక్రమం అయితే వలంటీర్లు పాల్గొనలేరు. వాళ్లను కూడా పాల్గొనేట్లు చేయడం కోసం ప్రభుత్వ కార్యక్రమంగా మార్చినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కార్యక్రమం ద్వారా సమాజంలో ప్రభావితం చేయగల వ్యక్తులను ఆకట్టుకోగలరా! మధ్య తరగతి వర్గంలో సానుకూలత సాధించగలరా? అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

దిశ, ఏపీ బ్యూరో: రానున్న ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. ప్రతి సచివాలయం పరిధిలో సంక్షేమ పథకాల ద్వారా ఎంత మందికి ఎంతెంత లబ్ధి చేకూరిందనే కార్యక్రమానికి ‘వై ఏపీ నీడ్స్ జగన్​’ అనే పేరు పెట్టారు. గతంలో గడప గడపకూ మన ప్రభుత్వమంటూ పార్టీ చేయాల్సిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఏఏ పథకాల ద్వారా ఆ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరిందో వివరించారు. ఇప్పుడు చేపట్టిన మళ్లీ జగన్​ఎందుకంటే అనే కార్యక్రమంతో సచివాలయంలో పోస్టర్ల ద్వారా ఎంత మందికి ఎంతెంత లబ్ధి చేకూరిందో వివరిస్తున్నారు. పనిలో పనిగా వివిధ సామాజిక వర్గాల్లో ప్రభావితం చేయగలిగిన వాళ్లను కలుసుకుంటున్నారు. ప్రభుత్వం పట్ల వాళ్లను సానుకూలంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రచారంలో ఉద్యోగులు, వలంటీర్లు

ప్రస్తుతం ఈ ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, వలంటీర్లు పాల్గొంటున్నారు. ప్రజాప్రతినిధులు కూడా కలుస్తున్నారు. తద్వారా ఉద్యోగుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి లేదనే సంకేతాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. తద్వారా అర్బన్ ఓటర్లలో పట్టు పెంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నామధ్య జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీకి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

సీపీఎస్ స్థానంలో జీపీఎస్

సీపీఎస్ రద్దు చేయకుండా దాని స్థానంలో ప్రభుత్వం జీపీఎస్‌ను తీసుకొచ్చింది. దీంతో ఉద్యోగ వర్గాలు కస్సు మంటున్నాయి. ఇంకా పీఆర్సీ, పెండింగ్​బకాయిల చెల్లింపు విషయాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఉపాధ్యాయ వర్గమైతే తీవ్ర ఆగ్రహంతో ఉంది. గ్రామీణ అర్బన్ ప్రాంతాల్లోని మధ్య తరగతి వర్గానికి ప్రభుత్వంపై సానుకూలత కనిపించడం లేదు. ప్రధానంగా నిరుద్యోగం, అధిక ధరలు, పన్నుల భారాలు, నిరంతరం పెరుగుతున్న విద్యుత్​, రవాణా చార్జీలతో మధ్య తరగతి జీవులు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాల జోలికి వెళ్లకుండా ఆయా వర్గాలను ఎలా దగ్గర చేసుకోగలరనేది మిలియన్​డాలర్ల ప్రశ్న. రాష్ట్రానికి మళ్లీ జగన్ అవసరమేంటనే ప్రచారం ఆశించిన లక్ష్యాలను చేరుకుంటుందా..? అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News