టీటీడీలో అ’ధర్మారెడ్డి’..కొడుకు పొలిటికల్ ఫ్యూచర్ కోసం శ్రీవారి సొమ్ములు కొట్టేస్తున్న భూమన
పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి కలిసి తమ వ్యాపార దోపిడీ కేంద్రంగా మార్చారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి కలిసి తమ వ్యాపార దోపిడీ కేంద్రంగా మార్చారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. ఈవో ధర్మారెడ్డిని ఇటీవలే సీఎం జగన్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ధర్మారెడ్డిగా మార్చాడని ఆరోపించారు. ఢిల్లీలో ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్‌లో పనిచేస్తున్న ధర్మారెడ్డిని జగన్ రెడ్డి ఏరికోరి రాష్ట్రానికి తీసుకొచ్చాడని, అసలు అతనికి టీటీడీ అధికారిగా పనిచేసే అర్హత ఉందా అని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆనం వెంకట రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘గతంలో వైఎస్ఆర్ సీఎం అయ్యాక ధర్మారెడ్డిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నియమించారని అప్పటి నుంచి ఆయన మరణించే వరకు కొనసాగారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ మరణం అనంతరం ధర్మారెడ్డి తిరిగి డిఫెన్స్ సర్వీసులకు వెళ్లిపోయాడని గుర్తు చేశారు. ఇదే ధర్మారెడ్డి తిరిగి జగన్ ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంపై వాలిపోయాడని విమర్శించారు. ఢిల్లీలో ఉన్న ధర్మారెడ్డిని డిప్యుటేషన్ పై ఏపీకి పంపాలని జగన్ మోడీకి లేఖ రాయడం ఓకే చెప్పడం చకచకా జరిగిపోయిందని ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు.
తాడేపల్లిలో సజ్జల ఎంతో.. తిరుపతిలో ధర్మారెడ్డి అంత?
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఐఏఎస్ అధికారులు పనిచేయాల్సిన స్థానంలో డిఫెన్స్‌లో పనిచేసే ధర్మారెడ్డిని నియమించడం చట్ట, ధర్మ విరుద్ధం అని ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై సాటి సివిల్ సర్వీస్ అధికారులు స్పందించరా? అని నిలదీశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అటెండర్‌గా... జగన్ సేవలో తరించే ఆయన తిరుపతి గుమాస్తాగా ధర్మారెడ్డి పనిచేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి ఎంతో... తిరుమల లో ధర్మారెడ్డి అంత అని అభివర్ణించారు. ఢిల్లీకి చెందిన దీన్ దయాళ్ తల్వార్ 14 సెక్షన్ల కింద ధర్మారెడ్డిపై పెట్టిన కేసుల గురించి.. న్యాయస్థానం ధర్మారెడ్డికి నోటీసులు ఇచ్చిన విషయం జగన్ రెడ్డికి తెలుసా..లేదా? అన్నీ తెలిసి అనర్హుడిని ఎలా టీటీడీలో కొనసాగనిస్తారు? అని ప్రశ్నించారు. ఉదయం లేస్తే ధర్మారెడ్డి చేసే పని ఒక్కటే.. ప్రత్యేకవిమానంలో పూజారుల్ని ఎక్కించుకొని ఢిల్లీకి వెళ్లడం..అక్కడ ఆ శీర్వచనాల పేరుతో పెద్దపెద్దవాళ్లను కలిసి వారిద్వారా తనకు కావాల్సిన పనులు .. ఇతర వ్యవహారాలు చక్కబెట్టుకోవడం అని విమర్శించారు.
శ్రీవారి సొమ్ము కొడుకు కోసం ఖర్చు
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి స్వామివారి సొమ్మును తన కుమారుడు అభినవ్ రెడ్డి ఎన్నికల కోసం ఖర్చుపెడుతున్నాడు అని ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. తిరుపతి కార్పొరేషన్ (తుడా) వేయాల్సిన రోడ్లను వెంకటేశ్వరస్వామి సొమ్ముతో వేసే అధికారం భూమనకు ఎవరిచ్చారని మండిపడ్డారు. అభినవ్ రెడ్డి రాజకీయ జీవితం కోసం రూ.150కోట్లతో తిరుపతిలో ఇంటర్నల్ రోడ్లు వేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా కరుణాకర్ రెడ్డి ఇప్పటివరకు స్వామివారికి సంబంధించిన ఎంత సొమ్మని ఇలా దారిమళ్లించాడో చెప్పాలి అని నిలదీశారు. స్వామివారి సొమ్మును తమ సొంత పనులకు వినియోగించడమే తప్పయితే..ఆ పనుల్లో మరల కరుణాకర రెడ్డి 10శాతం కమీషన్లు తీసుకుంటున్నాడు అని ఆరోపించారు. అందుకే తిరుపతిలో అందరూ ఆయన్ని 10శాతం కమీషన్ల కరుణాకర్ రెడ్డి అంటున్నారని ఆరోపించారు. టీటీడీ ఉద్యోగులకు వడమాలపేట ప్రాంతంలో ఇళ్లస్థలాలు ఇవ్వాలని టీటీడీ విభాగం భావించిందని అయితే ఆ స్థలాల మధ్యలో భూమన అభినయ్ రెడ్డికి 5 ఎకరాల భూమి ఎక్కడినుంచి వచ్చిందో కరుణాకర్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆనం వెంకట రమణారెడ్డి సవాల్ విసిరారు. మరోవైపు స్కామ్‌లు చేసి.. కేసుల్లో ఇరుక్కొని.. కోటీశ్వరులైపోయి.. జగన్ రెడ్డి మిత్రులైతే టీటీడీ సభ్యులు అయిపోతారా? అని నిలదీశారు. జగన్ రెడ్డి ఏలుబడిలో టీటీడీ సభ్యులు కావాలంటే ఒకటి కోటీశ్వరులు అయినా అయ్యిండాలి..లేదా స్కామ్ లైనా చేసి ఉండాలి..గజదొంగలైనా అవ్వాలి..లేదా జగన్ రెడ్డితో వ్యాపార లావాదేవీ లైనా ఉండాలి. ఈ విధానం ఎంతమాత్రం సరైంది కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా జరుగుతున్న అవినీతిపై టీడీపీప్రభుత్వం రాగానే విచారణ జరిపించి.. తప్పుచేసిన వారిని కచ్చితంగా న్యాయస్థానాల్లో నిలబెడుతుంది అని ఆనం వెంకట రమణా రెడ్డి హెచ్చరించారు.