కరిచే కుక్క మొరగదు... మొరిగే కుక్క కరవదు : పవన్ పై కొడాలి నాని
కరిచే కుక్క మొరగదు... మొరిగే కుక్క కరవదు అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
దిశ, డైనమిక్ బ్యూరో : కరిచే కుక్క మొరగదు... మొరిగే కుక్క కరవదు అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ పార్టీకి ఒక నిబద్దత, విధానాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏ పార్టీతో జతకడతారో ఎప్పుడు ఎవరితో ఎందుకు ఉంటారో పవన కల్యాణ్‌కే తెలియదంటూ ఎద్దేవా చేశారు. రెండు చోట్ల పోటీ చేసి ఓటమిపాలైన పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర అంటూ గంతులేస్తుంటే 151 మంది ఉన్న తామేం చేయాలని అన్నారు. మరోవైపు టీడీపీ, జనసేన పొత్తుపైనా పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుల వ్యవహారంలో పవన్ కల్యాణ్ వ్యవహారశైలి గందరగోళంగా ఉందన్నారు. టీడీపీతో కలవబోమని బీజేపీ స్పష్టంగా చెప్తోందని... కానీ పవన్ కల్యాణ్ మాత్రం తాను ఎన్టీఏలో ఉన్నానంటూ ప్రకటనలు ఇస్తున్నాడని చెప్పుకొచ్చారు. ఒకవైపు బీజేపీతో పొత్తులో ఉంటూనే మరోవైపు టీడీపీతో కూడా పొత్తు అని అంటున్నాడని అసలు పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని మాజీమంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు.
చంద్రబాబు గజదొంగ
వారాహి విజయయాత్రలో పవన్ కల్యాణ్ వైసీపీని రూపాయి పావలా పార్టీ అంటున్నాడని అంటే ఆయన ఉద్దేశం ప్రకారం వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 125 సీట్లు వస్తాయని ఒప్పుకున్నట్లేనా అని మాజీమంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. అంటే టీడీపీ-జనసేన పొత్తుకు 25 సీట్లు వస్తాయని పవన్ కల్యాణ్ ఉద్దేశమని మాజీమంత్రి కొడాలి నాని అన్నారు. మరోవైపు స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ఘాటుగా స్పందించారు. చంద్రబాబు అక్రమాలు చేయలేదని వాదించడం లేదని...చంద్రబాబు అరెస్ట్ కు గవర్నర్ అనుమతి తీసుకోలేదని మాత్రమే ఆయన తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారని చెప్పుకొచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం చేసిననట్లు ఒప్పుకున్నట్లేనా అని అన్నారు. ఎవరైనా తమ నాయకుడు అక్రమాలు చేయలేదని... తమ క్లైంట్ అవినీతి చేయలేదని వాదిస్తారని కానీ సీఐడీ అరెస్ట్ చేసే సమయంలో గవర్నర్ అనుమతి తీసుకోలేదని వాదించడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అతిపెద్ద దొంగ అంటూ తీవ్ర వ్యాక్యలు చేశారు. అలాంటి గజదొంగను అరెస్ట్ చేసేందుకు గవర్నర్ అనుమతి అవసరం లేదని చెప్పుకొచ్చారు. 2004కు ముందు చంద్రబాబు కేవలం కమీషన్లకు కక్కుర్తి పడేవారని.. లోకేశ్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారో పార్టీని, టీడీపీ ప్రభుత్వాన్ని వందశాతం అవినీతిమయం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు గజ దొంగ, 420, చీటర్ అని చంద్రబాబు దోపిడీలను ప్రజలు తెలుసుకుంటున్నారని ఆయనను ప్రజలు ఎప్పటికీ క్షమించరని మాజీమంత్రి కొడాలి నాని హెచ్చరించారు.