రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ : సీఎం వైఎస్ జగన్
ప్రతీ ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్ అందివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రతీ ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్ అందివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సబ్‌స్టేషన్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి కష్టాలు తీరనున్నాయని...నేడు ప్రారంభించిన సబ్‌స్టేషన్లను స్థానికులకే అంకితం చేస్తున్నామని సీఎం వెల్లడించారు. రైతులకు 9 గంటల విద్యుత్ పగటి పూటే ఇవ్వాలని అధికారంలోకి రాగానే నిర్ణయించామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 28 సబ్ స్టేషన్లకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్‌కో) శ్రీకారం చుట్టిందన్నారు. సీఎం జగన్ వర్చువల్ విధానంలో 16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్‌స్టేషన్ల ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ...దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. 14 జిల్లాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతోంది. 28 సబ్ స్టేషన్లలో కొన్నింటిని ప్రారంభించాం..కొన్నింటి పనులు ప్రారంభిస్తాం. గోదావరి ముంపు ప్రాంతాల్లో చింతూరు, వీఆర్‌పురం, ఎటపాక తదితర ప్రాంతాల్లో ఇటీవలే తిరిగినప్పుడు సబ్‌స్టేషన్లే లేకపోవడంవల్ల ఇబ్బందులు వస్తున్నాయని అక్కడి వారు చెప్పారు. అక్కడ సబ్‌స్టేషన్లను ప్రారంభిస్తూ అక్కడి ప్రజలకు అంకితం చేస్తున్నాం అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. 12 సబ్‌స్టేషన్లను ప్రారంభిస్తున్నాం....16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేస్తున్నామని వెల్లడించారు. రూ.3,100 కోట్ల వ్యయంతో కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, సత్యసాయి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలోని 28 ప్రాంతాల్లో 132/33 కేవీ, 220/132 కేవీ, 400/220 కేవీ, 400/132 కేవీ సామర్థ్యాలతో ఈ సబ్ స్టేషన్లు ఏర్పాటవుతున్నాయని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.
రైతులకు ఉచిత విద్యుత్
ట్రాన్స్‌మిషన్ కెపాసిటీని విస్తరించుకుంటూ, నాణ్యమైన విద్యుత్ ప్రతి గ్రామానికి ప్రతి రైతుకు ఇచ్చే వ్యవస్థను క్రియేట్ చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. రైతులకు 9 గంటల పాటు పగటిపూటే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రూ.1700 కోట్ల తో ఫీడర్లను ఏర్పాటుచేసి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌ను స్థిరంగా ఇవ్వడానికి రూ.2.4లకే యూనిట్ ధరతో సెకీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. మరో 25 సంవత్సరాలపాటు రైతులకు ఎలాంటి ఢోకా లేకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. దీనివల్లరాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుంది అని సీఎం వైఎస్ జగన్ వివరించారు.
రూ.3400 కోట్లతో 850 మెగావాట్ల సోలార్ పవర్
రాష్ట్రవ్యాప్తంగా సబ్ స్టేషన్ల కోసం రూ.3099 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కొన్నింటిని ప్రారంభించామని.. మరికొన్నింటి పనులు ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. రూ. 3400 కోట్లతో 850 మెగావాట్ల సోలార్ పవర్‌కు శ్రీకారం చుడుతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. 6500 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. అవేరా స్కూటర్స్ తయారీ సంస్థకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించింది. లక్ష స్కూటర్ల ఉత్పత్తి దిశగా సామర్థ్యాన్ని పెంచుకుంటుంది అని వెల్లడించారు.‘100 మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నాయి. తాజా పెట్టుబడి వల్ల అదనపు ఉద్యోగాలు వస్తాయి. 28 సబ్ స్టేషన్లలో 200 మందికి ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. 850 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు వల్ల 1700 ఉద్యోగాలు వస్తున్నాయి. హెచ్‌పీసీఎల్‌తో రూ.10 వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందం పెడుతున్నాం. సోలార్,విండ్, పీఎస్పీ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను వీరు పెడుతున్నారు. దాదాపుగా 1500 మందికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.‘కాలుష్యరహిత విద్యుత్ రాష్ట్రానికి మేలు చేస్తుంది. పలు విద్యుత్ ప్రాజెక్టులను ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ ఈ రంగంలో మరింత అభివృద్ధి సాధించే దిశలో అడుగులు ముందుకు వేస్తున్నాం అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
రెండు సోలార్ ప్రాజెక్టులు కూడా..
వైఎస్ఆర్ కడపలో 750 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, అనంతపురంలో 100 మెగావాట్ల మరో సోలార్ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా సీఎం వైఎస జగన్ శంకుస్థాపన చేశారు. కడప జిల్లా మైలవరం మండలంలో 1,000 మెగావాట్ల సోలార్ పార్కు అభివృద్ధికి కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) ఆమోదం తెలిపింది. ఇందులో 250 మెగావాట్లను 2020 ఫిబ్రవరి 8న ప్రారంభించారు. మిగిలిన 750 మెగావాట్లను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) ద్వారా అభివృద్ధి చేయనున్నారు. ఈ 750 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు పెట్టుబడి అవుతుందని అంచనా. ఏడాదిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్లాంట్ ఏటా 1,500 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. దీనిద్వారా సంవత్సరానికి 12 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని అంచనా. అలాగే శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని ఎన్.పీ.కుంట, గాలివీడు గ్రామాల వద్ద 1,500 మెగావాట్ల సోలార్ పార్క్ ఎంఎన్ఆర్ఈ ఆమోదం తెలిపింది. వివిధ సోలార్ పవర్ డెవలపర్లు 1,400 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తిచేశారు. మిగిలిన 100 మెగావాట్ల కోసం, హెచ్పీసీఎల్ ముందుకొచ్చింది. ఈ సోలార్ ప్రాజెక్టుకు రూ.400 కోట్లు పెట్టుబడి అంచనా వేయగా, ఏడాది నిర్మాణ కాలంలో 200 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్లాంట్ ఏటా 200 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. తద్వారా ఏటా 1.6 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.