పెరుగుతున్న గోదావరి..స్పిల్‌వే గేట్ల నుండి 45 వేల క్యూసెక్కుల నీరు విడుదల

గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద వరద నీటి మట్టం క్రమేణా పెరుగుతుంది.

Update: 2024-07-04 14:28 GMT

దిశ,ఏలూరు:గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద వరద నీటి మట్టం క్రమేణా పెరుగుతుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉపనదులు శబరి, ఇంద్రావతి, సీలేరు, కిన్నెరసాని, మానేరు, ప్రాణహిత, మంజీర, పూర్ణ, ప్రవర, పర్ణ నదుల నీటి మట్టం పెరిగి జలాలు గోదావరిలోకి కలుస్తున్నాయి. దీంతో పోలవరం వద్ద ఎర్ర నీరు కనబడుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 26.390 మీటర్లు, దిగువన 16.430 మీటర్లు, ఎగువ కాఫర్‌ డ్యాంకి ఎగువన 26.480 మీటర్లు, దిగువ కాఫర్ డ్యాంకి దిగువన 16.520 మీటర్లు నీటిమట్టం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

స్పిల్ వే లోకి వస్తున్న వరద జలాలను ఎప్పటికప్పుడు స్పిల్ వే 48 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నట్లు ఈఈ మల్లిఖార్జునరావు, పి.వెంకటరమణ తెలిపారు. స్పిల్‌వే నుండి 45వేల క్యూసెక్కు నీటిని దిగువక విడుదల చేస్తున్నారు. గోదావరి నీటి మట్టం పెరగడంతో స్పిల్‌ చానల్‌పై రోడ్డు మార్గం నీట మునిగింది. వరద నీటి మధ్యలో నాలుగు గేదెలు చిక్కుకుపోయాయి. పోలవరం ప్రాజెక్టులో 902 హిల్‌ ప్రాంతం నుంచి మహానందీశ్వరస్వామి ఆలయం మీదుగా దిగువ కాఫర్‌ డ్యాంకి మట్టి తరలింపు వాహనాలు రాకపోకలు సాగించడానికి స్పిల్‌ ఛానల్‌పై తూరలతో రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో ఆ మార్గం వరద నీటితో మునిగిపోయింది.


Similar News