బయటపడ్డ 13వ శతాబ్దానికి చెందిన శిల్పాలు
పల్నాడు మండల కేంద్రంలోని దుర్గి శివాలయంలో అద్భుత శిల్పాలు బయటపడ్డాయి. శివాలయ పునరుద్ధనలో భాగంగా 13వ శతాబ్దికి చెందిన, చరిత్ర కలిగిన శిల్పాలు వెలుగులోకి వచ్చాయి.
దిశ, వెబ్‌డెస్క్: పల్నాడు మండల కేంద్రంలోని దుర్గి శివాలయంలో అద్భుత శిల్పాలు బయటపడ్డాయి. శివాలయ పునరుద్ధనలో భాగంగా 13వ శతాబ్దికి చెందిన, చరిత్ర కలిగిన శిల్పాలు వెలుగులోకి వచ్చాయి. ఈ శిల్పాలపై ప్రముఖ చరిత్రకారుడు, ప్లీచే ఇండియా ఫౌండేషన్ సీఈఓ డా.ఈమని శివనాగిరెడ్డి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బయటపడిన శిల్పాలు 13వ శతాబ్దంలో కాకతీయుల కాలానికి చెందినవని, వాటిలో అద్భుత శిల్పకళా నైపుణ్యంతో చెక్కిన మహిషాసుర మర్దని, చతుర్ముక బ్రహ్మ, చెన్నకేశవ, చాముండి, సరస్వతి శిల్పాలు ఉన్నాయని చెప్పారు.
దుర్గి ఆలయంలో ఉన్న గణపతి దేవుని శాసనం వల్ల, దుర్గి కాకతీయలు కాలంలో ఒక ప్రముఖ పాలనా కేంద్రంగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఈ శిల్పాలు కాకతీయ గణపతి దేవుని కాలానికి చెందినవని అన్నారు. ఈ శిల్పాలను నేటి తరాలకు చూపించి ప్రత్యేకంగా తెలియజేసేలా మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ శిల్పాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలపై ఉందన్నారు.