Breaking: పులివెందులలో భారీ వర్షం.. పోలింగ్ కేంద్రం వద్ద కూలిపోయిన టెంట్లు, ఎగిరిపడ్డ కుర్చీలు
ఏపీ ఎన్నికలకు వర్షం భయపట్టుకుంది.....
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికలకు వర్షం భయపట్టుకుంది. వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగా పలుచోట్ల ఈదురుగాలలతో కూడిన వర్షం పడుతోంది. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు, కుర్చీలు చెల్లాచెదురుగా ఎగిరి పడుతున్నాయి. తాజాగా కడప జిల్లా పులివెందులలో మధ్యాహ్నం వర్షం బీభత్సం సృష్టించింది. ఉన్నట్టుంది పులివెందులలో వాతావరణం మారిపోయింది. భారీ ఈదురుగాలులతో వర్షం విరుచుకుపడింది. దీంతో పులివెందుల పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికలకు ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయాయి. కుర్చీలు ఎగిరిపడ్డారు. ఎన్నికల అధికారులు సైతం ఇబ్బందులు పడ్డారు. రేపటి ఎన్నికలకు ఆటంకం కలుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు పులివెందులలో కురిసిన వర్షానికి రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. అత్యంత వేగంగా వీచిన ఈదురుగాలులతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఒక్కసారిగా దంచికొట్టిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీటితో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.