అగ్రరాజ్యాన్ని భయపెడుతోన్న ‘దోమ’
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి.. 2020 ఏడాదిని ప్రపంచదేశాల చరిత్రలో ఓ చేదు జ్ఞాపకంగా మిగల్చగా, శాస్త్రవేత్తలకు ఓ సవాల్ విసిరింది. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా, పలు దేశాల్లోవ్యాక్సిన్ తయారీదశలో ఉంది. ‘కరోనా’ పుట్టుక ఇప్పటికీ ఓ మిస్టరీగా మిగిలిపోయింది. ఈ సమయంలో మరో పాండమిక్ వస్తే ప్రజల పరిస్థితి ఎలా? ఆలోచిస్తేనే భయమేస్తుంది. అందుకే తదుపరి విపత్తును ముందుగానే ఊహించడానికి గబ్బిలాలు, పందులు, పాము, అలుగు వంటి ఎన్నో జీవజాతులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి.. 2020 ఏడాదిని ప్రపంచదేశాల చరిత్రలో ఓ చేదు జ్ఞాపకంగా మిగల్చగా, శాస్త్రవేత్తలకు ఓ సవాల్ విసిరింది. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా, పలు దేశాల్లోవ్యాక్సిన్ తయారీదశలో ఉంది. ‘కరోనా’ పుట్టుక ఇప్పటికీ ఓ మిస్టరీగా మిగిలిపోయింది. ఈ సమయంలో మరో పాండమిక్ వస్తే ప్రజల పరిస్థితి ఎలా? ఆలోచిస్తేనే భయమేస్తుంది. అందుకే తదుపరి విపత్తును ముందుగానే ఊహించడానికి గబ్బిలాలు, పందులు, పాము, అలుగు వంటి ఎన్నో జీవజాతులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో మనతో పాటే జీవిస్తూ, మన రక్తాన్ని పీల్చే చిన్ని ‘దోమ’ మరో పాండమిక్‌కు కారణమైతే? ఆ ప్రమాదాన్ని ఊహించలేం కదా..యూఎస్‌లోని నావల్ బేస్..గ్వాంటనేమో బేలో కనిపించిన ఓ దోమ మరో పాండమిక్‌ను తీసుకొస్తుందని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు.
గ్వాంటనామో బేలోని యునైటెడ్ స్టేట్స్ నావికాదళం ఉండే ప్రాంతంలో ‘ఈడెస్ విట్టాటస్’ అనే ఓ దోమను 2019 జూన్‌లో తొలిసారి గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా కనిపించే 3,500 దోమ జాతులలో ఇది ఒకటి కాగా, ఇది ఉత్తర అమెరికాలోని డజను లేదా అంతకంటే ఎక్కువ జాతులకు పరాన్నజీవులు లేదా మానవులకు హానికరమైన వ్యాధికారక పదార్థాలను మోసుకెళ్తుంది. ఏడెస్ అల్బోపిక్టస్, ఈడెస్ ఈజిప్ట్ వంటి ఇతర దోమ జాతులు డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికున్‌గున్యా వంటి వ్యాధులను వ్యాప్తి చేయగా, ఈడెస్ విట్టాటస్ మాత్రం మలేరియా మినహా దాదాపు అన్ని ప్రమాదకరమైన దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. ఈడెస్ విట్టాటస్ భారత ఉపఖండానికి చెందిన దోమ కాగా, ఆఫ్రికా ఐరోపాలోనూ కనిపించే ఈ మస్కిటో తొలిసారి పాశ్చాత్య దేశాల్లో అడుగుపెట్టింది. దాంతో ఆమెరికా శాస్త్రవేత్తల బృందం ఆ దోమను ఐసొలేషన్‌లో ఉంచడంతో పాటు, ఈ దోమల జనాభాను నియంత్రించడానికి చర్యలు చేపట్టింది.
షిప్ కంటెయినర్లు లేదా విమానాల్లో ఎగ్స్(ఈడెస్ విట్టాటస్) రూపంలో అమెరికాకు వచ్చి ఉంటాయని, ఇక్కడి శీతల వాతావరణం కారణంగా ఒకే సీజన్లో దోమలు అనేక సార్లు సంతానోత్పత్తి చేసే వీలుందని, తద్వారా వైరస్‌లు మరింత దూరం వ్యాప్తి చెందుతాయని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో ‘దోమ’లు వినాశకరమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని, జీవ సంబంధమైన యుద్ధానికి ఇదో ప్రారంభ ఉదాహరణ అని అమెరికా చరిత్రకారుడు తిమోతి సి.వైన్‌గార్డ్ (ది మస్కిటో -2019 పుస్తక రచయిత) పేర్కొన్నారు. అంతేకాదు క్రీస్తుపూర్వం 415 నుంచి 413 వరకు జరిగిన పెలోపొన్నేసియన్ యుద్ధంలో స్పార్టాన్లు.. ఎథీనియన్లను దోమల బారిన పడ్డ చిత్తడి నేలల్లోకి రప్పించారు. దాంతో వారిని దోమలు కుట్టగా, అందులో 70% పైగా మంది మలేరియాతో చనిపోయారు. చెంఘీజ్ ఖాన్, ప్రపంచ యోధుడు అలెగ్జాండర్ కూడా దోమ కాటు వల్లే చనిపోయారని తిమోతి తన పుస్తకంలో వెల్లడించారు. అలెగ్జాండర్ మరణం విషయంలో కచ్చితమైన కారణం ఇంతవరకు తెలియదు.
యూరోపియన్లు రాకముందు వేలాది సంవత్సరాలు అమెరికా మలేరియా రహితంగా ఉందని, ఆ తర్వాతే మలేరియా వ్యాధులు వచ్చాయని, వియత్నాం యుద్ధంలో బులెట్లు, లేదా గాయాలతో కంటే కంటే దోమల ద్వారా సంక్రమించిన వ్యాధుల ద్వారానే ఎక్కువ మంది సైనికులు మరణించారని రీసెర్చ్ డైరెక్టర్ లింటన్ చెప్పారు. ప్రస్తుత కాలంలోనూ మిలిటరీని ప్రభావితం చేసే టాప్ 50 వ్యాధులలో 20 దోమల ద్వారే సంభవిస్తాయని ఆమె పేర్కొన్నారు. 1999- 2003 మధ్య వందలాది మంది అమెరికన్లు వెస్ట్ నైలు వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోగా, 2013లో చికున్‌గున్యా 31 దేశాలలో దాదాపు 8 లక్షల మంది ప్రజలను అనారోగ్యానికి గురిచేసింది. బ్రెజిల్‌లో 2015-16లో జికా వ్యాప్తి ఈ కోవలోకే వస్తుంది.
ఒక శతాబ్దం క్రితం అగ్రరాజ్యమంతటా అనోఫిలస్ దోమతో మలేరియా వ్యాధులు తీవ్రంగా ప్రబలాయి. ఇప్పటికీ అక్కడ ప్రతి ఏడాది వేలాది మందికి ఈ దోమ వల్ల అనారోగ్యం కలుగుతుంది. ఒక్క అమెరికానే కాదు, ప్రపంచవ్యాప్తంగా దోమల ద్వారా సంక్రమిస్తున్న వ్యాధుల కారణంగా ఏటా పది లక్షలకు పైగా ప్రజలు చనిపోతుండగా, దాదాపు 700 మిలియన్ల మందికి వ్యాధులు సోకుతున్నాయి అంటే భూమిపై నివసిస్తున్న ప్రతి 10 మందిలో ఒకరు దోమకాటు వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. ఇక ప్రస్తుతం కొవిడ్ పాండమిక్ సెకండ్ వేవ్‌తో వణుకుతున్న అమెరికా..‘ఈడెస్ విట్టాటస్’ దోమ విషయంలో నిర్లక్ష్యం వహించడం లేదు. ఆ దోమ నుంచి ప్రజలను కాపాడటానికి అన్ని చర్యలను చేపడుతోంది.