'గీత' మార్చే.. గిరక తాళ్లు!

దిశ, న్యూస్ బ్యూరో: పర్యావరణ సమతుల్యతతో పాటు సరైన వర్షపాతం కోసం చెట్ల పెంపకం అనివార్యం. ప్రభుత్వం కూడా హరితహారం పేరుతో ఆ దిశగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతోంది. అయితే ఇందులో భాగంగా ఎక్కడా కూడా తాటి చెట్లను నాటిన దాఖలాలు లేవు. ఎందుకంటే తాటిచెట్లు అనగానే మనకు కల్లు మాత్రమే గుర్తొస్తోంది. కానీ అదో కల్పవృక్షం అన్న సత్యాన్ని గుర్తించడం లేదు. పిడుగుల నుంచి రక్షణగా.. అన్నింటికీ మించి గీత కార్మికులకు […]

Update: 2020-05-31 01:54 GMT

దిశ, న్యూస్ బ్యూరో: పర్యావరణ సమతుల్యతతో పాటు సరైన వర్షపాతం కోసం చెట్ల పెంపకం అనివార్యం. ప్రభుత్వం కూడా హరితహారం పేరుతో ఆ దిశగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతోంది. అయితే ఇందులో భాగంగా ఎక్కడా కూడా తాటి చెట్లను నాటిన దాఖలాలు లేవు. ఎందుకంటే తాటిచెట్లు అనగానే మనకు కల్లు మాత్రమే గుర్తొస్తోంది. కానీ అదో కల్పవృక్షం అన్న సత్యాన్ని గుర్తించడం లేదు. పిడుగుల నుంచి రక్షణగా.. అన్నింటికీ మించి గీత కార్మికులకు ఉపాధి మార్గంగా తాటిచెట్లు విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. చెట్టులోని ప్రతీ భాగం ఉపయుక్తంగా ఉండే తాటిచెట్లను పెంచడం వల్ల ఇవేకాక మరెన్నో లాభాలున్నాయని పామ్ ప్రమోటర్స్‌ సొసైటీ చెబుతోంది.

పురాతన గ్రంథాలను ఈ తరాలకు అందించిన ఘనత తాటి చెట్లదే (ఆకులపై రాసి భద్రపరచడం). తమిళనాడులో రాష్ట్ర చెట్టుగా, కాంబోడియాలో జాతీయ చెట్టుగా గుర్తించడం తాటిచెట్టు ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. వియత్నాం, ఆఫ్రికా, కెన్యా, ఇథోపియా, టాంజానియాల్లో పిడుగుపాట్ల నుంచి రక్షణగా తాటిచెట్లను పెంచుతుండగా.. ఇండియాలో ఒడిశాలోనూ ఇప్పటికే ఆ ప్రక్రియను మొదలెట్టారు. కానీ, నిత్యం ఎత్తయిన చెట్లెక్కి కల్లుతీసే గీత కార్మికుల బతుకులు మాత్రం గాలిలో దీపాలే. కల్లుతీసే క్రమంలో ఎత్తయిన చెట్లపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి చాలామంది ప్రాణాలు కోల్పోయిన, వికలాంగులుగా మారిన సంఘటనలు అనేకం. అందుకే ఇప్పుడు పామ్ ప్రమోటర్స్‌ సొసైటీ.. పొట్టి తాటి చెట్ల పెంపకాన్ని బాధ్యతగా చేపడుతోంది. రెండేండ్లుగా లక్షలాది గింజలను ఉచితంగా సప్లయి చేస్తోంది. బీహార్‌, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి గింజలను తెప్పించి ఔత్సాహిక రైతులకు, కల్లు గీత కార్మికులకు అడిగినన్ని ఉచితంగా సప్లయి చేస్తోంది.

పొడుగు కంటే పొట్టే శ్రేయస్కరం

60, 70 అడుగుల ఎత్తయిన తాటి చెట్లెక్కి కల్లు తీయడం సాహసమే. దానికి బదులుగా 20 నుంచి 30 అడుగుల ఎత్తులో ఉండే పొట్టి తాటి చెట్ల నుంచి సరిపడా కల్లు/నీరాను ఉత్పత్తి చేయొచ్చు. పైగా పొడుగు తాటి చెట్ల నుంచి 12 ఏండ్ల తర్వాతే కల్లు/నీరా తీసే అవకాశం ఉండగా.. అవే పొట్టి చెట్లయితే 5 ఏండ్లకే కల్లును ఉత్పత్తి చేయగలవు. ఫిబ్రవరి-మార్చి, మే-జూన్‌ కాలంలో నీరాను తీయొచ్చు. ఇదేగాక తాటి ఆకులు, బెల్లం తయారీ ద్వారానూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. ఒక్కో పొట్టి తాటి చెట్టు నుంచి 20 నుంచి 100 లీటర్ల నీరాను సాధించే అవకాశం ఉండగా.. రంపచోడవరంలో ఒక చెట్టు నుంచి రోజుకు 60 లీటర్లు తీస్తున్నట్టు సమాచారం. టిష్యూ కల్చర్‌ ద్వారా ఆ రకం చెట్లను పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు పామ్ ప్రమోటర్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ జి. విష్ణుస్వరూప్‌రెడ్డి ‘దిశ’కు వివరించారు.

ఏ వాతావరణానికైనా అనుకూలం

తాటి చెట్టు ఆయుష్షు 120 ఏండ్లు. గుట్టలు, పుట్టలు, ఎడారి ప్రాంతాలు, నీటి వసతి లేని ప్రాంతాలు.. ఎక్కడైనా సరే, రోజూ నీళ్లు పోసే అవసరం లేకుండానే పెరుగుతాయి. తెలంగాణలో గెట్టు పంచాయతీలు లేకుండా చూసిన చెట్లల్లో తాటి చెట్లది ప్రధాన భూమిక. ఏటా ఆర్నెళ్ల పాటు కల్లును అందించే తాటి చెట్లను విరివిగా పెంచడం ద్వారా క్లోరల్‌ హైడ్రేట్‌, డైజోఫారం, ఆల్ఫ్రాజోం వంటి మాదక ద్రవ్యాలను వాడే అవసరం ఉండదు. కాగా, తాటి చెట్లు లేని ఏరియాల్లోనే కల్తీ కల్లు దందా నడుస్తోందని పామ్ ప్రమోటర్స్‌ సొసైటీ ఆరోపిస్తుండటం గమనార్హం.

తాటి చెట్లతో లెక్కలేనన్ని ప్రయోజనాలు

గ్రామాల్లోనే కాదు అడవుల్లోనూ తాటిచెట్లను పెంచడం వల్ల కోతులు, ఇతర పశు పక్ష్యాదులకు తాటిపండ్లు ఆహారంగా ఉపయోగపడతాయి. ఉడుతలు, ఏనుగులు వీటిని ఇష్టంగా తింటుంటాయి. అందుకే శ్రీలంకలో తాటి చెట్లను విరివిగా పెంచుతున్నారు. సాగు భూముల్లో ఏ ఇతర చెట్లను పెంచినా ఆ పరిసరాల్లో సాగు కష్టమవుతుంది. కానీ, తాటి చెట్లు ఎత్తుగా ఉండటం వల్ల ఏ పంటకూ నష్టం వాటిల్లదు. అలాగే తాటి బెల్లంకు ఇప్పుడిప్పుడే డిమాండ్‌ పెరుగుతోంది. ఆయుర్వేదంలోనూ తాటిబెల్లం వినియోగంపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. డయాబెటిస్‌‌ను నియంత్రించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. బెంగాల్‌లో తాటి పండ్ల నుంచి తయారుచేసే స్వీట్స్‌(జల్బరా సందేశ్‌) ప్రసిద్ధి. బీహార్‌, తమిళనాడులో తాటి చెట్లు, వాటి ఉత్పత్తులపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. అంతేకాకుండా తాటి కల్లు నుంచి బయో డీజిల్‌, బయో ఇథనాల్‌, ఆల్కహాల్‌ తయారు చేయొచ్చు.

తాటి ఉత్పత్తులతో రోగ నిరోధక శక్తి : జి. విష్ణుస్వరూప్‌రెడ్డి, చైర్మన్‌, పామ్‌ ప్రమోటర్స్‌ సొసైటీ (రిటైర్డ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌)

మార్కెట్‌లో నీరా డిమాండ్‌‌కు తగ్గ ఉత్పత్తిని సాధించాలంటే తాటి చెట్లు విరివిగా పెంచాలి. ఈ క్రమంలో ప్రమాదాలను నివారించేందుకు పొట్టి తాటి చెట్లను, డాలర్‌/గిరక తాటి చెట్లను ప్రమోట్‌ చేస్తున్నాం. ఉచితంగానే గింజలను సప్లయి చేస్తున్నాం. నీరాలోని పోషకాలు, మైక్రోన్యూట్రియెంట్లతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కరోనా వైరస్‌ వంటి వాటిని తట్టుకోవచ్చు. అయితే నీరా తయారు చేయాలంటే కల్లు పులవకుండా చూడాలి. అంటే నాలుగైదు గంటలకోసారి గీయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పొట్టి తాటి చెట్లే అవసరం. అనేక దేశాల్లో తాటి చెట్లపై చేస్తోన్న పరిశోధనలను అధ్యయనం చేస్తున్నాం. వాటినే ఇక్కడా అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం.

పొట్టి తాటి చెట్లకు డిమాండ్‌: దయాకర్‌గౌడ్‌, పామ్ ప్రమోటర్స్‌ సొసైటీ సభ్యుడు, హైదరాబాద్‌

పొట్టి తాటి చెట్ల గింజలు కావాలని చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాలకు సప్లయి చేశాం. ఆదిలాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వరకు, ఆంధ్రప్రదేశ్‌లనూ పొట్టి తాటి చెట్లను పెంచుతామంటూ ఫోన్లు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా విత్తనాలను సరిపడా తెప్పించలేకపోతున్నాం. చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. నీరా డిమాండ్‌ను అందుకోవడానికి అవసరానికి తగ్గట్లుగా చెట్లను పెంచాలి. ప్రతి ఏటా సీజన్‌లో పొట్టి తాటి చెట్లను పెంచాలని ప్రచారం చేస్తున్నాం.

Tags:    

Similar News