ఇదెక్కడి విచిత్రం.. పంచాయతీ ఫండ్స్ కోసం వేలం పాటనా..?
దిశ, ఖమ్మం రూరల్ : అక్కడ పంచాయతీ నిధులకు స్థానిక రాజకీయ పార్టీల నాయకులందరూ కలిసి వేలం పాట నిర్వహించారంటే నమ్మశక్యంగా లేదా.. ఇదే నిజం. ఖమ్మం జిల్లాకు కూత వేటు దూరంలో ఉన్న రూరల్ మండలం గుర్రలపాడు పంచాయతీలో ఆలస్యంగా వెలుగుచూసింది. 2018 జనరల్ ఎన్నికలకు ముందు రూరల్ మండలంలోని ఐదు పంచాయతీలను కార్పొరేషన్లో కలుపుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తర్వాత వచ్చిన పంచాయతీ ఎన్నికలకు ఈ ఐదు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. తరువాత […]
దిశ, ఖమ్మం రూరల్ : అక్కడ పంచాయతీ నిధులకు స్థానిక రాజకీయ పార్టీల నాయకులందరూ కలిసి వేలం పాట నిర్వహించారంటే నమ్మశక్యంగా లేదా.. ఇదే నిజం. ఖమ్మం జిల్లాకు కూత వేటు దూరంలో ఉన్న రూరల్ మండలం గుర్రలపాడు పంచాయతీలో ఆలస్యంగా వెలుగుచూసింది. 2018 జనరల్ ఎన్నికలకు ముందు రూరల్ మండలంలోని ఐదు పంచాయతీలను కార్పొరేషన్లో కలుపుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తర్వాత వచ్చిన పంచాయతీ ఎన్నికలకు ఈ ఐదు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. తరువాత స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి కృషితో కార్పొరేషన్లో కలిసిన ఐదు విలీన పంచాయతీలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తిస్తున్నట్టు ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఈ ఐదు పంచాయతీలకు కలెక్టర్ స్పెషల్ అఫీసర్లను నియమించారు. పంచాయతీల్లో ఉన్న ఫండ్స్‌తో అభివృద్ధి పనులు నిర్వహించేందుకు వీడీసీ తీర్మానాల అవసరం ఉంది.
గుర్రలపాడు పంచాయతీలో రూ.59 లక్షల వరకు ఫండ్స్ ఉన్నాయి. వీటికి అధికారులు ఎక్కడ ఏ పనులు చేయాలో అంచనాలు తయారు చేసి సిద్ధంగా ఉంచారు. ఈ గ్రామానికి చెందిన రాజకీయ పార్టీల నాయకులు కొందరు డ్రామాలు చేసి అట్టి ఫండ్స్‌కు వేలం పాట ఏర్పాటు చేసి రూ.7.90 లక్షలకు అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి కట్టబెట్టారు. ఇదేమిటి అంటే గ్రామంలో నిర్మాణంలో పెండింగ్‌లో ఉన్న ఆలయ అభివృద్ధి కోసమని చెప్పడం విడ్డురంగా లేదు మరి. అంతగా అతనికి దేవుని మీద భక్తి ఉంటే సొంతంగా ఇచ్చే అవకాశం ఉంది. కానీ పంచాయతీ ఫండ్స్ వేలంలో దక్కించుకుని దానికి దేవుడి పేరు చెప్పడం.. ఇదెక్కడి న్యాయమని ప్రజలు ఫైర్ అవుతున్నారు. అధికారులకు పంచాయతీలో ఏకాభిప్రాయం కుదరకపోతే ఆన్లైన్ టెండర్ నిర్వహించాలే తప్పా.. ఇలా అధికారులు వేలం పాటను పరోక్షంగా ప్రొత్సహించడం వెనుక అసలు కథ అర్థం కావడం లేదు. ఆన్లైన్ టెండర్ నిర్వహించడం వలన పంచాయతీకి కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పంచాయతీ ఫండ్స్ వేలం వెనుక ఉన్న అధికారులు ఎవరో…నిగ్గుతేల్చి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుని.. వేలం పాటను రద్ధు చేసి తగు ఆన్లైన్ టెండర్ నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.