ఈ జాతీయ రహదారిలో ప్రయాణం చేస్తున్నారా..? జర జాగ్రత్తా!
దిశ, పరకాల: హన్మకొండ పరకాల జాతీయ రహదారిలో ప్రయాణం చేస్తున్నారా..! జర జాగ్రత్తగా వెళ్లండి. పాలక పక్షాలు అధికార యంత్రాంగం నిర్లక్ష్యం మూలంగా పరకాల నుంచి దామెర మండలం సైలాని బాబా దర్గా వరకు అడుగడుగునా గుంతలతో ప్రమాదం పొంచి ఉంది. కోట్లాది రూపాయలతో నిర్మించిన జాతీయ రహదారి కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా నిర్మించడంతో నాణ్యత లోపించి రోడ్డు గుంతలమయంగా మారింది. పరకాల పట్టణంలోని అంబేద్కర్ స్టార్చ్, కన్యకా పరమేశ్వరి టెంపుల్, సాయి బాబా టెంపుల్ ఏరియాలో భారీగా […]
దిశ, పరకాల: హన్మకొండ పరకాల జాతీయ రహదారిలో ప్రయాణం చేస్తున్నారా..! జర జాగ్రత్తగా వెళ్లండి. పాలక పక్షాలు అధికార యంత్రాంగం నిర్లక్ష్యం మూలంగా పరకాల నుంచి దామెర మండలం సైలాని బాబా దర్గా వరకు అడుగడుగునా గుంతలతో ప్రమాదం పొంచి ఉంది. కోట్లాది రూపాయలతో నిర్మించిన జాతీయ రహదారి కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా నిర్మించడంతో నాణ్యత లోపించి రోడ్డు గుంతలమయంగా మారింది. పరకాల పట్టణంలోని అంబేద్కర్ స్టార్చ్, కన్యకా పరమేశ్వరి టెంపుల్, సాయి బాబా టెంపుల్ ఏరియాలో భారీగా గుంతలు ఏర్పడ్డాయి, శాయంపేట మండలం తహారాపూర్ గుట్టలు మొదలుకొని కొత్తగట్టుసింగారం స్టేజి వరకు రోడ్డు గుంతలను తలపిస్తోంది. ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ సర్కిల్‌లో పరకాల హన్మకొండ టర్నింగ్ పాయింట్ వద్ద భారీగా గుంతలు ఏర్పడి అనేక ప్రమాదాలకు నిలయంగా మారాయి.
ఎన్ ఎస్ ఆర్, ఊరుగొండ కాకతీయ కెనాల్ వద్ద, దామెర మండలం పసరగొండ స్టేజ్, ఓగులాపూర్ పవర్ గిడ్ మొదలుకొని శైలాని బాబా వరకు రోడ్డు అడుగడుగున గుంతలతో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల మూలంగా మరిన్ని గుంతలు ఏర్పడి ఈ రూట్‌లో వెళ్లే వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ప్రయాణించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇటీవలికాలంలో శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పెంబర్తి చంద్రమౌళి ఈ గుంతల మూలంగానే తన ద్విచక్ర వాహనం అదుపు తప్పి మృతి చెందడం జరిగింది. గత సోమవారం వర్గాల పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో ఆటో అదుపుతప్పి పల్టీకొట్టడంతో నిజామాబాద్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గుంతలో ఆత్మకూరు మండలం గుడెపాడు సర్కిల్ వద్ద జరిగిన ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇరువురు భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందడం అందరిని కలచివేసింది. నిత్యం వందలాది ఇసుక లారీలు, గ్రానైట్ క్వారీలకు సంబంధించిన లారీలతో నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి పట్ల నేషనల్ హైవే అథారిటీ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పట్టీపట్టనట్లు వ్యవహరించటం పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు స్పందించి తక్షణ మరమ్మతులు చేపట్టాలని లేనట్లయితే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.