ఫెంగల్‌ తుఫాన్‌ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

మూడు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెంది.. తుఫానుగా మారింది.

Update: 2024-11-28 03:33 GMT

దిశ, వెబ్ డెస్క్: మూడు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెంది.. తుఫానుగా మారింది. దీనికి వాతావరణ శాఖ అధికారులు ఫెంగల్ తుఫాన్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ వాయుగుండం వేగంగా భారత్ వైపు దూసుకొస్తుంది. ప్రస్తుతం నాగపట్నానికి 320 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. ఈ రోజు సాయంత్రానికి ఇది తుఫానుగా మారి.. ఈ నెల 30 కారైకల్‌, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా తుఫాను కారణంగా ఇప్పటికే తమిళనాడులో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో.. అప్రమత్తమైన ప్రభుత్వం పలు జిల్లాల్లోని స్కూళ్లు పాఠశాలకు సెలవులు ప్రకటించింది. ఈ ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కూడా ఉంది.

ఇప్పటికే రాష్ట్రంలోని సగం జిల్లాలను మబ్బులు కమ్మెయగా.. రాగల 24 గంటల్లో.. ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్షాలు కురుస్తాయని, పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని.. దక్షిణ కోస్తా తీరం వెంబడి భారీ ఈదురు గాలులు వీస్తాయని.. తుఫాను ప్రభావంతో సముద్రం ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ఫెంగల్ తుఫాను కారణంగా.. చెన్నై సహా నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిన్నటి నుంచి నాగపట్నం లో వర్ష బీభత్సం సృష్టించగా.. వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఈ క్రమంలో ముందస్తుగా అప్రమత్తమైన అధికారులు.. స్థానిక ప్రజలను, మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


Similar News