సౌతాఫ్రికా ఆల్‌రౌండ్ షో.. అమెరికాపై విజయం

గ్రూపు దశను అజేయంగా ముగించిన సౌతాఫ్రికా సూపర్-8 రౌండ్‌ను విజయంతో ఆరంభించింది.

Update: 2024-06-19 19:03 GMT

దిశ, స్పోర్ట్స్ : గ్రూపు దశను అజేయంగా ముగించిన సౌతాఫ్రికా సూపర్-8 రౌండ్‌ను విజయంతో ఆరంభించింది. ఛేదనలో అమెరికా బ్యాటర్ ఆండ్రీస్ గౌస్ టెన్షన్ పెట్టగా.. సఫారీలు విజయం కోసం కాస్త శ్రమించాల్సి వచ్చింది. నార్త్ సౌండ్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో అమెరికాపై 18 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 194/4 స్కోరు చేసింది. డికాక్(74) మెరుపు హాఫ్ సెంచరీకితోడు మార్‌క్రమ్(46), క్లాసెన్(36 నాటౌట్) మెరవడంతో భారీ స్కోరు దక్కింది. అనంతరం ఛేదనకు దిగిన అమెరికా నిర్ణీత ఓవర్లలో 176/6 స్కోరే చేసింది. ఆండ్రీస్ గౌస్(80) చెలరేగడంతో ఒక దశలో అమెరికా టెన్షన్ పెట్టినా విజయం సౌతాఫ్రికానే వరించింది. రబాడా(3/18) రాణించాడు.

ఆండ్రీస్ గౌస్ చివరి వరకు..

195 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్ స్టీవెన్ టేలర్ వరుస బౌండరీలతో అమెరికా ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించాడు. అయితే, ఆ దూకుడు ఎంతో సేపు లేదు. 4వ ఓవర్‌లో టేలర్(24)ను రబాడా అవుట్ చేయగా.. ఆ తర్వాత అమెరికా తడబడింది. 23 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 76/5 స్కోరుతో కష్టాల్లో పడింది. ఇక అమెరికా పని అయిపోయిందనుకున్న తరుణంలో అప్పటికే క్రీజులో పాతుకపోయిన ఓపెనర్ ఆండ్రీస్ గౌస్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు ,సిక్స్‌లతో సఫారీ బౌలర్లపై విరుచుకపడ్డాడు. మరోవైపు, హర్మీత్ సింగ్(38) కూడా ధాటిగా ఆడాడు. దీంతో అమెరికా 18 ఓవర్లలో 167/5 స్కోరుతో నిలవడంతో సౌతాఫ్రికా జట్టులో టెన్షన్ మొదలైంది. 12 బంతుల్లో 28 పరుగులు కావాల్సి ఉండగా.. గౌస్ దూకుడు అమెరికాకు విజయం కట్టబెట్టేలా కనిపించాడు. అయితే, 19వ ఓవర్‌ వేసిన రబాడా.. హర్మీత్‌ను అవుట్ చేయడంతోపాటు 2 పరుగులే ఇవ్వడంతో సౌతాఫ్రికా ఊపిరి పీల్చుకుంది. గౌస్(80 నాటౌట్) చివరి వరకూ పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడా 3 వికెట్లతో సత్తాచాటగా.. మహరాజ్, నోర్జే, షంసీ చెరో వికెట్ పడగొట్టారు.

పూరన్ మెరుపుల్

మొదట సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌‌లో ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. హెండ్రిక్స్(11) నిరాశపర్చడంతో 16 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. హెండ్రిక్స్ విఫలమైనా మరో ఓపెనర్ డికాక్ మాత్రం చెలరేగి ఆడాడు. 4వ ఓవర్‌లో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 28 పరుగులు పిండుకున్నాడు. క్రీజులో ఉన్నంత సేపు అతను ఫోర్లు, సిక్స్‌లు బాదుతూనే ఉన్నాడు. .కెప్టెన్ మార్‌క్రమ్ కూడా దూకుడుగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో చూస్తుండగానే డికాక్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అదే జోరును కొనసాగిస్తున్న క్రమంలో డికాక్(74) దూకుడుు హర్మీత్ బ్రేక్‌ వేశాడు. క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్(0) నిరాశపర్చగా.. కాసేపటికే మార్‌క్రమ్(46) అవుటయ్యాడు. ఆఖర్లో క్లాసెన్(36 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్(20 నాటౌట్) మెరవడంతో 190కి పైగా పరుగులు చేసింది. అమెరికాబౌలర్లలో నేత్రావల్కర్, హర్మీత్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

స్కోరుబోర్డు

సౌతాఫ్రికా ఇన్నింగ్స్ : 194/4(20 ఓవర్లు)

డికాక్(సి)జహంగీర్(బి)హర్మీత్ 74, హెండ్రిక్స్(సి)అండర్సన్(బి)నేత్రావల్కర్ 11, మార్‌క్రమ్(సి)అలీ ఖాన్(బి)నేత్రావల్కర్ 46, మిల్లర్(సి అండ్ బి)హర్మీత్ 0, క్లాసెన్ 36 నాటౌట్, ట్రిస్టన్ స్టబ్స్ 20 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 7.

వికెట్ల పతనం : 16-1, 126-2, 126-3, 141-4

బౌలింగ్ : నేత్రావల్కర్(4-0-21-2), అలీ ఖాన్(4-0-45-0), జస్‌దీప్(2-0-36-0), నోస్తుష్ కెంజిగే(3-0-29-0), హర్మీత్(4-0-24-2), స్టీవెన్ టేలర్(2-0-21-0), అండర్సన్(1-0-17-0)

అమెరికా ఇన్నింగ్స్ : 176/6(20 ఓవర్లు)

స్టీవెన్ టేలర్(సి)క్లాసెన్(బి)రబాడా 24, ఆండ్రీస్ గౌస్ 80 నాటౌట్, నితీశ్(సి)ట్రిస్టన్ స్టబ్స్(బి)రబాడా 8, ఆరోన్ జోన్స్(సి)డి కాక్(బి)మహరాజ్ 0, అండర్సన్(బి)నోర్జే 12, జహంగీర్ ఎల్బీడబ్ల్యూ(బి)షంసీ 3, హర్మీత్(సి)ట్రిస్టన్ స్టబ్స్(బి)రబాడా 38, జస్‌దీప్ 2 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 9.

వికెట్ల పతనం : 33-1, 53-2, 56-3, 71-4, 76-5, 167-6

బౌలింగ్ : జాన్సెన్(3-0-32-0), మార్‌క్రమ్(1-0-13-0), రబాడా(4-0-18-3), మహరాజ్(4-0-24-1), నోర్జే(4-0-37-1), షంసీ(4-0-50-1)


Similar News