అమెరికా బ్యాటర్ ఆరోన్ జోన్స్ విధ్వంసం.. క్రిస్ గేల్ తర్వాత అతనే

టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య అమెరికా తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టింది.

Update: 2024-06-02 12:56 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్ సంబురం మొదలైంది. ఈ పొట్టి ప్రపంచకప్‌కు వెస్టిండీస్‌, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌లో అమెరికా తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టింది. డల్లాస్ వేదికగా ఆదివారం జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో కెనడాపై 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన కెనడా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఓపెనర్ నవనీత్ ధాలివాల్(61), నికోలస్ కిర్టన్(51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. శ్రేయాస్ మొవ్వ(32 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ రాణించాడు.

అయితే, 195 పరుగుల భారీ లక్ష్యాన్ని అమెరికా అలవోకగా ఛేదించింది. ఛేదనలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఓపెనర్లు స్టీవెన్ టేలర్(0), మోనాంక్ పటేల్(16) నిరాశపర్చడంతో ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. అయితే, ఆరోన్ జోన్స్(94, 40 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్స్‌లు) సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎడాపెడా సిక్స్‌లు బాదిన అతను 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి అమెరికా తరపున ఫాస్టెస్ట్ అర్ధ శతకాన్ని నెలకొల్పాడు. తన ఇన్నింగ్స్‌లో అతను 10 సిక్స్‌లు కొట్టాడు. దీంతో క్రిస్ గేల్(11 సిక్స్)ల తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అతనికితోడు ఆండ్రీస్ గౌస్(65) కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు. మూడో వికెట్‌కు వీరిద్దరు 131 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో అమెరికా విజయానికి చేరువైంది. ఆండ్రీస్ గౌస్ అవుటైనా ఆరోన్ జోన్స్ మిగతా పని పూర్తి చేశాడు. 


Similar News