T20 World Cup : సూపర్-8 సమరానికి రోహిత్ సేన సిద్ధం.. రేపు అఫ్ఘాన్‌తో ఢీ
టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా సూపర్-8 సమరానికి సిద్ధమైంది.
దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా సూపర్-8 సమరానికి సిద్ధమైంది. గురువారం కరేబియన్ గడ్డపై ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. చరిత్ర పరిశీలిస్తే అఫ్గాన్‌పై టీమ్ ఇండియాది వన్ సైడ్ వార్. ఈ ఏడాది ఆరంభంలో ఆ జట్టుపై టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ కూడా చేసింది. ఏ రకంగా చూసుకున్నా అఫ్గాన్‌పై భారత్ విజయం నల్లేరు మీద నడకే. కానీ, రెండో రౌండ్‌లో ప్రతి మ్యాచ్ కీలకమే. కాబట్టి, అఫ్గాన్‌ను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. అన్ని విభాగాల్లో సత్తాచాటాల్సిన అవసరం ఉన్నది.
బ్యాటింగ్‌లో మెరవాలె
గ్రూపు దశ మ్యాచ్‌లను పరిశీలిస్తే భారత బౌలింగ్ దళం బాగానే ఉంది. బుమ్రాకుతోడు అర్ష్‌దీప్ సింగ్, పాండ్యా సత్తాచాటుతున్నారు. సిరాజ్ పుంజుకోవాల్సి ఉంది. బ్యాటింగ్ పరంగానే జట్టు మెరుగవ్వాల్సి ఉంది. పంత్ ఒక్కడే నిలకడగా ఆడుతున్నాడు. అమెరికాపై సూర్య, దూబె ఫామ్ అందుకోవడం సానుకూలంశం. వారితోపాటు రోహిత్, కోహ్లీ ఫామ్‌లోకి వస్తే భారత్‌కు తిరుగుండదు. ఇక, పాండ్యా బంతితో రాణిస్తున్నా బ్యాటుతో సత్తాచాటలేకపోతున్నాడు. పాండ్యాతోపాటు జడేజా నుంచి జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శన ఆశిస్తున్నది. న్యూయార్క్‌తో పోలిస్తే కరేబియన్ పిచ్‌లు బ్యాటర్లకు అనుకూలంగా ఉండటంతో భారత బ్యాటర్లు మెరిసేందుకు అవకాశాలు ఎక్కువే.
అఫ్గాన్‌తో జాగ్రత్త
అఫ్గాన్‌పై విజయం భారత్‌కు పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ, ఆ జట్టును నమ్మడానికి లేదు. తమదైన రోజున అఫ్గాన్ జట్టు అద్భుతం చేయగలదు. గ్రూపు దశలో కివీస్‌కు షాకిచ్చిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. గుర్బాజ్(167) టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. జద్రాన్ కూడా ఫామ్‌లో ఉన్నారు. అజ్మతుల్లా, నబీ, రషీద్ ఖాన్‌లు కూడా సత్తాచాటగలరు. ఇక, బౌలర్లలో టాప్ వికెట్ టేకర్‌గా ఉన్న ఫరూఖీ(12 వికెట్లు), రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్‌లతో భారత బ్యాటర్లకు సవాల్ తప్పదు.
వార్ వన్ సైడ్
భారత్, అఫ్గాన్ జట్లు ఇప్పటివరకు టీ20ల్లో 8 సార్లు ఎదురుపడ్డాయి. ఈ పోరులో టీమ్ ఇండియాదే స్పష్టమైన ఆధిపత్యం. ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. అఫ్గాన్ ఒక్క మ్యాచ్‌లోనూ నెగ్గలేదు. టీ20 వరల్డ్ కప్‌లో ఇరు జట్లు తలపడటం ఇది నాలుగోసారి. గత మూడుసార్లు టీమ్ ఇండియానే నెగ్గింది.
పిచ్ రిపోర్టు
బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా అనుకూలించనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ స్టేడియంలో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 158. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. ఈ స్టేడియంలో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి.
తుది జట్లు(అంచనా)
భారత్ : రోహిత్(కెప్టెన్), కోహ్లీ, సూర్యకుమార్, పంత్, పాండ్యా, దూబె, అక్షర్, జడేజా, బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్.
ఆఫ్ఘనిస్తాన్ : జద్రాన్, గుల్బాద్దిన్, నజీబుల్లా, నబీ, గుర్బాజ్, అజ్మతుల్లా, రషీద్(కెప్టెన్), నంగేయాలియా ఖరోటే, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫరూఖీ.