భారత్, పాక్ మ్యాచ్ గురించి క్రేజీ అప్‌డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
టీ20 వరల్డ్ కప్‌లో జూన్ 9న నూయార్క్ వేదికగా పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది.
దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో జూన్ 9న నూయార్క్ వేదికగా పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్టు ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. టీ20 ప్రపంచకప్ పిచ్‌లను సిద్ధం చేయడానికి ఐసీసీ అడిలైడ్ ఓవల్ హెడ్ క్యూరేటర్ డామియన్ హగ్‌ను తీసుకుంది. తాజాగా ప్రపంచకప్ పిచ్‌ల గురించి హగ్ మాట్లాడుతూ.. ‘పిచ్‌లు పేస్, బౌన్స్‌కు సహకరిస్తాయి. ఆటగాళ్లు ఇష్టపడే విషయమేంటంటే బంతి బ్యాటుపైకి వస్తుంది.’ అని చెప్పాడు.
అలాగే, ఇటీవల ఐసీసీ హెడ్ ఆఫ్ ఈవెంట్స్ క్రిస్ టెట్లీ మాట్లాడుతూ.. ముంబైలోని వాంఖడే స్టేడియం మాదిరిగానే నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కొలతలు ఉంటాయని తెలిపాడు. హై స్కోరింగ్ నమోదయ్యే పిచ్‌ల్లో వాంఖడే ఒకటి. గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీస్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 724 పరుగులు నమోదయ్యాయి. న్యూయార్క్ పిచ్ కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుందని తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద ఖాయమేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.