T20 World Cup : నాలుగు జట్లలో ఫైనల్‌కు చేరే రెండు జట్లేవో?.. అందరిలోనూ టెన్షన్
టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8 రౌండ్ ముగిసింది.
దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8 రౌండ్ ముగిసింది. ఇక, సెమీస్ సమరం మొదలుకానుంది. సూపర్-8లో గ్రూపు-ఏ నుంచి భారత్, అఫ్గానిస్తాన్ జట్లు, గ్రూపు-బి నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. మరి, ఈ నాలుగు జట్లలో టైటిల్ పోరుకు చేరే రెండు జట్లేవో.. ఫైనల్‌కు చేరే జట్లపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు సంచలనాలు నమోదు చేస్తూ సాగిన ఈ పొట్టి ప్రపంచకప్‌లో సెమీస్ సమరం మరింత రసవత్తరంగా సాగనుంది.
భారత కాలమానం ప్రకారం గురువారమే రెండు సెమీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి సెమీస్‌లో సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్ జట్లు తలపడనున్నాయి. రెండో సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో రోహిత్ సేన తాడోపేడో తేల్చుకోనుంది. తొలి సెమీస్ గురువారం ఉదయం 6:00 గంటలకు ప్రారంభకానుండగా.. రెండో సెమీస్ రాత్రి 8:00 గంటలకు జరగనుంది. టోర్నీలో భారత్, సౌతాఫ్రికా జైత్రయాత్ర కొనసాగిస్తున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడలేదు. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్ అడ్డంకులను దాటుకుంటూ సెమీస్‌కు చేరుకుంటే.. అఫ్గాన్ సంచలనాలు సృష్టిస్తూ అడుగుపెట్టింది. కాబట్టి, ఏ జట్టునూ తక్కువ అంచనా వేయడానికి లేదు.
అయితే, భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. బలాబలాల పరంగా ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తుండటంతో ఆ పోరుపై అందరి దృష్టి నెలకొంది. అలాగే, 2022లో జరిగిన గత టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలోనే భారత్ ఓడిపోయి ఇంటిదారిపట్టింది. ఈ సారి కూడా సెమీస్‌లో ఆ జట్టునే ఢీకొట్టనుంది. దీంతో గత ప్రపంచకప్ ఓటమికి ఈ సారి ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తున్నది. గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓటమికి ఆస్ట్రేలియాపై కసితీరా పగ తీర్చుకున్నది. కంగారులను సూపర్-8లోనే ఇంటికి పంపించింది. ఇంగ్లాండ్‌కు సెమీస్‌లోనే చెక్ పెట్టాలనుకుంటున్నది. మరోవైపు, సౌతాఫ్రికా, అఫ్గాన్ పోరులో సఫారీలు ఫేవరెట్‌గా కనిపిస్తున్నా.. అఫ్గానులు ఏం చేయగలరో ఇప్పటికే నిరూపించారు.