ద్రవిడ్-రోహిత్ సూపర్ హిట్
కెప్టెన్‌గా రోహిత్.. హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్.. ప్రయాణం దాదాపుగా ఒకేసారి మొదలైంది.
దిశ, స్పోర్ట్స్ : కెప్టెన్‌గా రోహిత్.. హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్.. ప్రయాణం దాదాపుగా ఒకేసారి మొదలైంది. ఆ సమయానికి వాళ్లద్దరి లక్ష్యం ఒక్కటే.. ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐసీసీ కప్పును అందించడమే వారి టార్గెట్. ఆ ప్రయాణంలో ఎత్తుపల్లాలు చూశారు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23, గతేడాది వన్డే వరల్డ్ కప్‌ల్లో భారత్ ఫైనల్‌కు చేరింది. అయితే, కప్పు దక్కలేదు. అయినా వారు తమ నమ్మకాన్ని కోల్పోలేదు. ఎట్టకేలకు వారు తమ గోల్‌ను రీచ్ అయ్యారు. 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ ముద్దాడింది. ఈ అద్భుత క్షణాలతోనే హెడ్ కోచ్‌గా ద్రవిడ్, టీ20లకు రోహిత్ ముగింపు పలికారు. భారత్ కలను నెరవేర్చిన ద్రవిడ్, రోహిత్ కాంబినేషన్ భారత క్రికెట్‌లో సూపర్ హిట్‌గా నిలిచిపోనుంది.
ఎప్పుడో 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచాం. 2011 తర్వాత మళ్లీ వన్డే వరల్డ్ కప్ గెలవలేదు. 2013 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మరో ఐసీసీ టైటిల్ సాధించలేదు. పై మూడు కప్పులు ధోనీ సారథ్యంలోనే దక్కాయి. విరాట్ కోహ్లీ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అయినా అతని నాయకత్వంలో ఏదో ఒక దశలో భారత్‌కు నిరాశే మిగిలింది. ఏళ్లుగా టైటిల్ నిరీక్షణ తప్పలేదు. రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ జోడీ ఎదురుచూపులకు తెరదించింది. టీ20 వరల్డ్ కప్ గెలవడంలో హెడ్ కోచ్‌గా ద్రవిడ్, కెప్టెన్‌గా రోహిత్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ టీ20 ప్రపంచకప్ విజయం ఏ ఒక్క ఆటగాడితోనే వచ్చింది కాదు. జట్టులోని ప్రతి ప్లేయర్ ఏదో ఒక్క మ్యాచ్‌లో జట్టు విజయానికి తోడ్పడ్డారు. ఇలా జట్టు సమిష్టిగా ఉండటంలో కీలక పాత్ర కెప్టెన్, హెడ్ కోచ్‌లదే. ఆ పాత్రకు రోహిత్, ద్రవిడ్ పూర్తిగా న్యాయం చేశారు. మైదానంలో జట్టును నడిపించడంలో రోహిత్ సక్సెస్ అయితే.. కోచ్‌గా ద్రవిడ్ వెనుకుండి నడిపించాడు. ఆటగాళ్లపై, వారి సామర్థ్యాలపై నమ్మకముంచారు. అంతేకాకుండా, జట్టులో తమ పాత్రంటే వివరించారు. విఫలమైతే తుది జట్టును తప్పించలేదు. ఫామ్ అందుకునేందుకు వారికి అవకాశాలు ఇచ్చారు. అందుకు మంచి ఉదాహరణ ఈ టీ20 ప్రపంచకప్పే. టోర్నీలో కోహ్లీ, శివమ్ దూబె వరుసగా విఫలమయ్యారు. వారిని తప్పించాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి. కానీ, వారికి మద్దతుగా నిలిచారు. ఫైనల్‌లో కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడగా.. దూబె విలువైన పరుగులు జోడించిన విషయం తెలిసిందే.
మొదట్లో విమర్శలు
టీ20 వరల్డ్ కప్-2021 తర్వాత కోహ్లీ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గుడ్ చై చెప్పడంతో రోహిత్ పగ్గాలు చేపట్టాడు. అదే ప్రపంచకప్‌తో రవిశాస్త్రి పదవీకాలం ముగియగా.. ద్రవిడ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు అందుకున్నాడు. మొదట్లో రోహిత్, ద్రవిడ్ కాంబినేషన్‌కు ఎదురుదెబ్బలే తగిలాయి. 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌లో ఇంటిదారిపట్టింది. అదే ఏడాది ఆసియా కప్‌లో టీమిండియా సూపర్-4 రౌండ్‌కే పరిమితమైంది. దీంతో రెండు మూడేళ్లలో రిటైర్ అయ్యే రోహిత్‌కు కెప్టెన్సీగా పగ్గాలు అప్పగించడంపై విమర్శలు వచ్చాయి. అలాగే, ద్రవిడ్ సైతం విమర్శలు ఎదుర్కొన్నాడు.
12 నెలల్లో మూడు ఫైనల్స్
రోహిత్, ద్రవిడ్ చేసిన ప్రయత్నాలు 2023 నుంచి ఫలితాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. ద్వైపాక్షిక సిరీస్‌ల్లోనే కాకుండా ఐసీసీ ఈవెంట్లోనూ భారత్ తనదైన ముద్ర వేసింది. 2023లో ఆసియా కప్‌ను తిరిగి దక్కించకుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ ఆడింది. గతేడాది వన్డే వరల్డ్ కప్‌లోనూ ఫైనల్‌కు చేరింది. అయితే, ఆ రెండు సందర్భాల్లోనూ ఆసిస్ షాకిచ్చింది. కానీ, ఈ పొట్టి ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ చేజార్చుకోలేదు. 12 నెలల వ్యవధిలో భారత్ మూడు ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్‌కు చేరుకోవడం ఆషామాషి విషయం కాదు. ద్రవిడ్, రోహిత్ కాంబినేషన్‌లో ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. 17 టీ20 సిరీస్‌ల్లో 14 సిరీస్‌లు.. 13 వన్డే సిరీస్‌ల్లో 10.. ఆరు టెస్టు సిరీస్‌లను దక్కించుకోవడమంటే మామూలు విషయం కాదు. టీ20ల్లో రోహిత్ కెప్టెన్‌గా విన్నింగ్ పర్సంటేజ్ 79.03 శాతంగా ఉండటం విశేషం. అతని సారథ్యంలో భారత్ 62 మ్యాచ్‌లు ఆడగా.. 49 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.