అమెరికా జట్టు మినీ టీమ్ ఇండియా.. సగం మంది భారతీయులే

టీ20 వరల్డ్ కప్‌లో ఆతిథ్య జట్టు అమెరికా.. పాకిస్తాన్‌కు షాకిచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-06-07 16:51 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో ఆతిథ్య జట్టు అమెరికా.. పాకిస్తాన్‌కు షాకిచ్చిన విషయం తెలిసిందే. క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న అమెరికా పాక్‌ను ఓడించడం చిన్న విషయం కాదు. ఆ జట్టుకు ఇదే తొలి టీ20 వరల్డ్ కప్ కూడా. క్రికెట్‌లోనే పెను సంచలనం సృష్టించిన అమెరికా విజయంలో భారత మూలాలు ఉన్న ఆటగాళ్లు కీలక పాత్ర పోషించడం విశేషం. అమెరికాను మినీ టీమ్ ఇండియా అని చెప్పొచ్చు. ఆ జట్టులో దాదాపు సగం మంది భారత సంతతి ఆటగాళ్లే. అందులో పలువురి క్రికెట్ కెరీర్ భారత దేశవాళీలోనే మొదలైంది. మరి, అమెరికా జట్టులో ఉన్న భారత మూలాలు ఉన్న ఆటగాళ్లెవరో చూద్దాం..

కెప్టెన్ మనోడే

పాకిస్తాన్‌పై అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిసిన అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్‌ది ఇండియానే. భారత్‌లోనే పుట్టి పెరిగాడు. గుజరాత్‌లోని ఆనంద్‌లో ఓ వ్యాపారవేత్త కుటుంబంలో 1993లో జన్మించాడు. గుజరాత్ తరపున అండర్-16, అండర్-18 స్థాయిల్లో ఆడాడు. ఆ తర్వాత మోనాంక్ కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. అక్కడ కూడా అతను ఆటను వదల్లేదు. 2018 నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాడు. 2019లో యూఏఈపై టీ20ల్లో అమెరికా తరపున అరంగేట్రం చేశాడు. అదే ఏడాది వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2021‌లో అమెరికా జట్టు పగ్గాలు చేపట్టాడు. యూఎస్‌ఏ తరపున 47 వన్డేలు, 27 టీ20లు ఆడాడు.

రాహుల్ సహచరుడు నేత్రావల్కర్

ఒక్క మ్యాచ్‌తో క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు సౌరభ్ నేత్రావల్కర్. సూపర్ ఓవర్‌లో అద్బుతమైన బౌలింగ్‌తో అమెరికాను విజేతగా నిలిపాడు. అంతకుముందు పాక్ ఇన్నింగ్స్‌లోనూ 2 వికెట్లతో సత్తాచాటాడు. సౌరభ్ నేత్రావల్కర్ ప్రస్తుతం అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. అతని క్రికెట్ కెరీర్ మొదలైంది మాత్రం భారత దేశవాళీ క్రికెట్‌లోనే. 1991లో ముంబైలో జన్మించిన అతను ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. రంజీ మ్యాచ్‌లు కూడా ఆడాడు. టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సహచరుడు కూడా. 2010లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లో రాహుల్‌తో కలిసి ఆడాడు. మయాంక్ అగర్వాల్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, సందీప్ శర్మలతో కూడా అతను ఆడాడు. ఆ తర్వాత చదువు కోసం అమెరికా వెళ్లాడు. కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన అతను ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే సమయంలో అమెరికాలో స్థానిక టోర్నీలు ఆడిన అతను జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2019లో అమెరికా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన నేత్రావల్కర్.. 48 వన్డేలు, 29 టీ20లు ఆడాడు. అమెరికా జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.

ముంబైకి ఆడిన హర్మీత్ సింగ్

అమెరికా స్పిన్ ఆల్‌రౌండర్ హర్మీత్ సింగ్ కెరీర్ కూడా భారత దేశవాళీలోనే మొదలైంది. 1992లో ముంబైలో జన్మించిన అతను దేశవాళీ క్రికెట్‌లో ముంబై, త్రిపుర జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2013లో ఐపీఎల్‌‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాడు. 2012 అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2020లో అమెరికాకు వచ్చిన అతను ఈ ఏడాది ఏప్రిల్‌లో యూఎస్‌ఏ తరపున అరంగేట్రం చేశాడు. అమెరికా తరపున 8 టీ20లు ఆడిన అతను 81 పరుగులు, 7 వికెట్లు తీశాడు.

మిలింద్ కూడా..

అమెరికా జట్టులోని మరో స్పిన్ ఆల్‌రౌండర్ మిలింద్ కుమార్ ఢిల్లీలో పుట్టి పెరిగాడు. 1991లో జన్మించిన అతను దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ, సిక్కీం జట్లకు ఆడాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ, బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2021లో భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అతను అమెరికాకు వచ్చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కెనడాపై అమెరికా తరపున అరంగేట్రం చేశాడు. ఆ జట్టు తరపున నాలుగు టీ20లు ఆడాడు. అమెరికా జట్టులోని నోస్తుషా ప్రదీప్ కెంజిగె, నితీశ్ కుమార్, జస్దీప్ సింగ్, నిసర్గ్ పటేల్ కూడా భారత మూలాలు ఉన్న క్రికెటర్లే.


Similar News