T20 World Cup : శ్రీలంకకు హార్ట్ బ్రేక్.. దక్షిణాఫ్రికాకు గుడ్ న్యూస్

మాజీ చాంపియన్ శ్రీలంక‌కు హార్ట్ బ్రేక్. నేపాల్‌తో మ్యాచ్ వర్షార్పణమవడంతో టీ20 వరల్డ్ కప్‌లో ఆ జట్టు ప్రయాణం ముగిసింది.

Update: 2024-06-12 12:20 GMT

దిశ, స్పోర్ట్స్ : మాజీ చాంపియన్ శ్రీలంక‌కు హార్ట్ బ్రేక్. నేపాల్‌తో మ్యాచ్ వర్షార్పణమవడంతో టీ20 వరల్డ్ కప్‌లో ఆ జట్టు ప్రయాణం ముగిసింది. అధికారికంగా ప్రకటించకపోయినా లంకేయులకు సూపర్-8 దారులు మూసుకపోయాయి. బుధవారం ఫ్లోరిడా వేదికగా శ్రీలంక, నేపాల్ మధ్య జరగాల్సిన గ్రూపు-డి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆఖరికి ఐదు ఓవర్లు నిర్వహించాలని చూసినా వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో టాస్ పడకుముందు మ్యాచ్ కొట్టుకుపోయింది. అంపైర్లు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సూపర్-8 ఆశలు సంక్లిష్టం చేసుకున్న శ్రీలంకకు నేపాల్‌‌పై గెలిస్తే తర్వాతి రౌండ్ ఆశలు సజీవంగా ఉండేవి. శ్రీలంక ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.

సౌతాఫ్రికా తర్వాతి రౌండ్‌కు

శ్రీలంక, నేపాల్ మ్యాచ్ రద్దవడంతో సౌతాఫ్రికా గ్రూపు డి నుంచి సూపర్-8 రౌండ్‌కు చేరుకుంది. వరుసగా మూడు విజయాలు సాధించిన ఆ జట్టు ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నది. బంగ్లా, నెదర్లాండ్స్‌లలో ఒక్క జట్టు మాత్రమే ఆరు పాయింట్లు పొందే అవకాశం ఉండటంతో దక్షిణాఫ్రికాకు బెర్త్ ఖాయమైంది. దీంతో టీ20 వరల్డ్ కప్‌‌లో సూపర్-8 రౌండ్‌కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. మరోవైపు, శ్రీలంక టోర్నీ నుంచి నిష్ర్కమించినట్టే. ఈ నెల 13న బంగ్లా, నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా 4 పాయింట్ల పొందనుంది. ప్రస్తుతం ఒక్క పాయింట్‌తో ఉన్న లంక జట్టుకు ఈ నెల 17న నెదర్లాండ్స్‌తో జరిగే ఆఖరి మ్యాచ్ నామమాత్రమే కానుంది. ఆ మ్యాచ్‌లో నెగ్గినా ఆ జట్టు గరిష్టంగా 3 పాయింట్లే సాధిస్తుంది. కాబట్టి, టోర్నీలో లంకేయుల ఆట ముగిసింది. ఇక, గ్రూపు-డిలో రెండో బెర్త్ కోసం బంగ్లా, నెదర్లాండ్స్ మధ్య పోటీ నెలకొనగా.. నేపాల్‌కు కూడా అవకాశం ఉంది. 


Similar News