షకీబ్‌కు చోటు.. బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్ జట్టు ఇదే
వచ్చే నెల 2 నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే బంగ్లాదేశ్ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) ఖరారు చేసింది.
దిశ, స్పోర్ట్స్ : వచ్చే నెల 2 నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే బంగ్లాదేశ్ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) ఖరారు చేసింది. నజ్ముల్ హుస్సేన్ శాంటో నాయకత్వంలో 15 మందితో జట్టును మంగళవారం ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ తస్కిన్ అహ్మద్ వైస్ కెప్టెన్‌గా నియామకమయ్యాడు. జింబాబ్వేతో చివరి మ్యాచ్‌లో అతను గాయపడటంతో ప్రపంచకప్‌కు దూరమవుతాడని వార్తలు వచ్చాయి. అయితే, టోర్నమెంట్ నాటికి అతను కోలుకుంటాడని బంగ్లా జట్టు నమ్మకంగా ఉంది. ప్రపంచకప్ జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు చోటు దక్కింది. దాదాపు ఏడాదిపాటు టీ20 ఫార్మాట్‌కు దూరంగా ఉన్న అతను ఇటీవల జింబాబ్వేపై నాలుగో టీ20తో పునరాగమనం చేశాడు. ఆ మ్యాచ్‌లో 4 వికెట్లతో సత్తాచాటాడు. అలాగే, గత టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కని సీనియర్ బ్యాటర్ మహ్మదుల్లా కూడా సెలెక్టర్లు చాన్స్ ఇచ్చారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు బంగ్లాదేశ్ ఈ నెల చివర్లో అమెరికాతో మూడు టీ20లు ఆడనుంది. పొట్టి వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌లో జూన్ 7న శ్రీలంకను ఎదుర్కోనుంది.
బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్ జట్టు
శాంటో(కెప్టెన్), తస్కిన్ అహ్మద్(వైస్ కెప్టెన్), లిటాన్ దాస్, సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్ తమీమ్, షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, మహముద్ ఉల్లా రియాద్, జాకర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లామ్, మహేది హసన్, రిషాద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లామ్, తాంజిమ్ హసన్ షకీబ్. ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లు : అఫిఫ్ హుస్సేన్, హసన్ మహముద్.