పంత్ vs శాంసన్.. వికెట్ కీపర్‌గా అతనికే చాన్స్ ఎక్కువ?

మరో రెండు రోజుల్లో టీ20 వరల్డ్ కప్ మొదలుకానుంది. ఇప్పటికే భారత జట్టు న్యూయార్క్‌కు చేరుకుంది.

Update: 2024-05-30 15:59 GMT

దిశ, స్పోర్ట్స్ : మరో రెండు రోజుల్లో టీ20 వరల్డ్ కప్ మొదలుకానుంది. ఇప్పటికే భారత జట్టు న్యూయార్క్‌కు చేరుకుంది. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. టైటిలే లక్ష్యంగా టీమ్ ఇండియా పొట్టి ప్రపంచకప్ బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టుపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వికెట్ కీపర్ ఎంపిక హెడ్ కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మకు సవాల్ కానుంది. ఈ స్థానం కోసం రిషబ్ పంత్, సంజూ శాంసన్ పోటీపడుతున్నారు. మరి, ఎవరికీ చాన్స్ దక్కుతుందో?

టీ20 ప్రపంచకప్‌ జట్టులో పంత్, శాంసన్‌లకు చోటు దక్కుతుందని ముందు ఊహించిన వారు తక్కువే. ఎందుకంటే, జాతీయ జట్టుకు వచ్చే సరికి శాంసన్ నిలకడగా ఆడటంలో విఫలమవుతున్నాడన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు, 2022 డిసెంబర్‌లో ఘోర కారు ప్రమాదానికి గురైన పంత్ కోలుకుని నేరుగా ఐపీఎల్‌ ఆడాడు. దీంతో అతనిపై ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. మునపటి పంత్‌ను గుర్తు చేస్తాడా?.. ఇన్నింగ్స్ మొత్తం కీపింగ్ చేయగలడా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, వీరిద్దరూ ఐపీఎల్‌లో రాణించి ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించారు. టీమ్ ఇండియా తరపున టీ20ల్లో పంత్ 66 మ్యాచ్‌ల్లో 987 పరుగులు చేయగా.. శాంసన్ 25 మ్యాచ్‌ల్లో 374 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో మెరిశారు

ఇటీవల ఐపీఎల్‌లో పంత్, శాంసన్ అద్భుతంగా రాణించారు. శాంసన్ 15 ఇన్నింగ్స్‌ల్లో 531 పరుగులు చేశాడు. అందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. లీగ్ టాప్ స్కోర్లలో శాంసన్ 5వ స్థానంలో నిలిచాడు. మరోవైపు, పంత్ 13 ఇన్నింగ్స్‌ల్లో మూడు హాఫ్ సెంచరీల సహాయంతో 446 పరుగులు చేశాడు. ఢిల్లీ తరపున అతనే టాప్ స్కోరర్. ఇద్దరు 150కిపైగా స్ట్రైక్‌రేట్‌తోనే ఆడారు. అలాగే, కీపింగ్‌పరంగా శాంసన్‌తో పోలిస్తే పంత్ మెరుగ్గా ఉన్నాడు. శాంసన్ ఏడుగురిని అవుట్ చేయగా.. అందులో ఒక స్టంప్ అవుట్, ఆరు క్యాచ్‌లు ఉన్నాయి. పంత్ 16 మందిని అతను అవుట్ చేశాడు. అందులో ఐదుగురిని స్టంప్ చేయగా.. 11 క్యాచ్‌లు అందుకున్నాడు. లీగ్‌లో అత్యధిక మందిని అవుట్ చేసిన వికెట్ కీపర్ల జాబితాలో రాహుల్‌తో కలిసి పంత్ అగ్రస్థానంలో నిలిచాడు.

పంత్‌కే చాన్స్ ఎక్కువ!

తుది జట్టులో వికెట్ కీపర్‌గా పంత్‌ వైపే టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కారు ప్రమాదానికి ముందు పంత్ మూడు ఫార్మాట్లలో మెయిన్ వికెట్ కీపర్‌గా ఉన్నాడు. నిర్భయంగా ఆడే అతను జట్టుకు ఎన్నో సార్లు విజయాలను అందించాడు. మ్యాచ్‌ను మలుపు తిప్పే ఆటగాడిగానూ అతన్ని చూస్తారు. మరోవైపు, లెఫ్ట్ హ్యాండర్ అయిన పంత్‌కు లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కూడా కలిసిరానుంది. అయితే, వికెట్ కీపర్‌గా శాంసన్‌కు చోటు దక్కకపోయినా తుది జట్టులో స్థానం పొందే అవకాశాలు ఉన్నాయి. కోహ్లీ ఓపెనింగ్ చేస్తే 3వ స్థానం కోసం శాంసన్‌ను తీసుకోవచ్చు. ఓపెనర్‌గా శాంసన్‌కు కూడా మంచి రికార్డే ఉంది. కాబట్టి, ఓపెనర్‌గా అతన్ని ఆడించొచ్చు. 


Similar News