టీ20 వరల్డ్ కప్ జట్టులో పంత్?
టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసే భారత జట్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు చోటు ఖాయమేనా? అంటే సంబంధిత వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి.
దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసే భారత జట్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు చోటు ఖాయమేనా? అంటే సంబంధిత వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఐపీఎల్-17లో పంత్ రాణిస్తుండటంతో సెలెక్టర్లు అతని వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. 2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ దాదాపు 15 నెలలు ఆటకు దూరంగా ఉన్నాడు. ఇటీవలే కోలుకున్న అతను ఐపీఎల్‌తోనే తిరిగి మైదానంలోకి అడుగుపెట్టిన తెలిసిందే. అయితే, మునుపటి పంత్‌లా బ్యాటు ఝుళిపిస్తాడా?.. కీపింగ్ చేయగలడా? అన్న ఎన్నో అనుమానాల మధ్య అతను రీఎంట్రీ ఇచ్చాడు. కానీ, అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ అతను అదరగొడుతున్నాడు. బ్యాటుతోనూ మునుపటి మెరుపులు చూపిస్తూ.. కీపింగ్‌తోనూ ఆకట్టుకుని పొట్టి ప్రపంచకప్‌కు తాను పోటీలో ఉన్నానని నిరూపించుకున్నాడు.
జూన్‌లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ పొట్టి ప్రపంచకప్‌కు మే 1లోగా జట్లను ప్రకటించాల్సి ఉంది. ఐపీఎల్-17లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా బీసీసీఐ భారత జట్టును ఎంపిక చేస్తుందన్న వార్తలు వస్తున్నాయి. లీగ్‌లో సెలెక్టర్ల దృష్టిలో ఉన్న ఆటగాళ్లు ఇప్పటికే నాలుగేసి మ్యాచ్‌లు ఆడారు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ జట్టు కూర్పుపై సెలెక్టర్లు ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. వారి అంచనాలో రిషబ్ పంత్ కూడా ఉన్నట్టు సమాచారం. పంత్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడుతున్నా.. ప్లేయర్‌గా అతను మాత్రం అదరగొడుతున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 154.55 స్ట్రైక్ రేట్‌తో 153 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. చెన్నయ్‌పై 159 స్ట్రైక్‌రేటుతో, కోల్‌కతాపై 200 స్ట్రైక్‌రేటుతో అతని ఆడిన ఇన్నింగ్స్‌లను చూసి తీరాల్సిందే. అతను బాదిన బౌండరీలు మునుపటి పంత్‌ను గుర్తు చేస్తున్నాయి. వికెట్ల వెనకాల కీపింగ్‌తోనూ పంత్ ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ జట్టులో అతని బెర్త్ ఖాయమే అని వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్‌లో అతని బ్యాటింగ్, టీ20ల్లో అతని అనుభవాన్ని దృష్టి పెట్టుకుని సెలెక్టర్లు పంత్‌ను మెయిన్ వికెట్ కీపర్‌గా తీసుకోవాలని భావిస్తున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మరి, జట్టుపై ప్రకటన వస్తేనే దీనిపై స్పష్టతరానుంది.