T20 World Cup : ఫైనల్‌కు ముందు టీమ్ ఇండియా కీలక నిర్ణయం
టీ20 వరల్డ్ కప్ టైటిల్‌కు టీమ్ ఇండియా అడుగుదూరంలో నిలిచింది.
దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ టైటిల్‌కు టీమ్ ఇండియా అడుగుదూరంలో నిలిచింది. రేపు ఫైనల్‌లో సౌతాఫ్రికాతో తాడోపేడో తేల్చుకోనుంది. టైటిల్ పోరుకు ముందు భారత జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీ మ్యాచ్ ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేసింది. మరోవైపు, సౌతాఫ్రికా ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొననున్నది. కీలక మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లకు విశ్రాంతిని ఇవ్వాలనే ఉద్దేశంతోనే టీమ్ ఇండియా ప్రాక్టీస్‌ను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.
గ్రూపు దశ మ్యాచ్‌ల తర్వాత భారత జట్టు షెడ్యూల్ బిజీగా బిజీగా ఉంది. 8 రోజుల వ్యవధిలోనే నాలుగు మ్యాచ్‌లు ఆడింది. సూపర్-8 రౌండ్‌లో ఈ నెల 20న అఫ్గానిస్తాన్, 22న బంగ్లాదేశ్, 24న ఆస్ట్రేలియాతో తలపడింది. మ్యాచ్‌కు మ్యాచ్‌కు మధ్య ఒక్క రోజు గ్యాప్ మాత్రమే ఉంది. ఆసిస్‌తో మ్యాచ్ అనంతరం సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో పోరుకు కూడా రెండు రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. గురువారం జరిగిన సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను 68 పరుగుల తేడాతో రోహిత్ సేన విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు సెమీస్‌కు ఫైనల్‌కు మధ్య ఒక్క రోజు మాత్రమే ఉంది. ఇలా భారత ఆటగాళ్లకు వరుస మ్యాచ్‌లతో సరైన విశ్రాంతి లభించలేదు. ఫైనల్‌కు ముందు ప్రశాంతంగా మైదానంలోకి అడుగుపెట్టాలని టీమ్ ఇండియా భావిస్తున్నది. అందుకే, ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. సెమీస్ అనంతరం కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ.. ‘జట్టుగా మేం ప్రశాంతతో ఉండాలి. ఫైనల్ అనేది మాకు ఎంతో కీలకం. ప్రశాంతతతో ఉంటేనే మంచి నిర్ణయాలు తీసుకోగలం.’ అని చెప్పుకొచ్చాడు.