వచ్చే వారం నేను నిరుద్యోగిని.. జీవితమంటే ఇదేనమో : ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు గొప్ప ముగింపు దక్కింది.

Update: 2024-06-30 13:00 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు గొప్ప ముగింపు దక్కింది. టీమ్ ఇండియాకు టీ20 వరల్డ్ కప్ అందించి తన సేవలకు సెలవిచ్చాడు. పొట్టి ప్రపంచకప్ ఫైనల్‌తో హెడ్ కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. మ్యాచ్ అనంతరం ద్రవిడ్.. జట్టుతో అనుబంధం, తన భవిష్యత్తు గురించి మాట్లాడాడు. ‘రెండేళ్ల ఈ ప్రయాణం టీ20 వరల్డ్ కప్ గురించే కాదు. మేము కోరుకున్న నైపుణ్యాలు, ఆటగాళ్లతో కూడిన జట్టు నిర్మాణం. దీని గురించి నేను బాధ్యతలు చేపట్టిన 2021 సెప్టెంబర్‌లోనే చర్చలు జరిగాయి. ఈ ప్రయాణం అద్భుతం. ఇది నాకు జీవితాంతం గుర్తుండే జ్ఞాపకం. అది సాధ్యం చేసిన జట్టు, సపోర్టింగ్ స్టాఫ్‌కు థాంక్యూ.’ అని తెలిపాడు.

భారత క్రికెట్ భవిష్యత్తుపై మాట్లాడుతూ..‘ప్రస్తుతం భారత క్రికెట్‌లో అద్భుతమైన ప్రతిభగల ఆటగాళ్లు ఉన్నారు. వారి ఆత్మవిశ్వాసం, వారి సామర్థ్యం వేరే లెవల్‌లో ఉన్నాయి. మేము ఐసీసీ ట్రోఫీ కోసం చాలా ఏళ్లుగా ప్రయత్నించాం. ఇప్పుడు ప్రపంచకప్ గెలిచిన ఆత్మవిశ్వాసాని ముందుకు తీసుకెళ్తూ.. ఐదారేళ్లలో భారత జట్టుకు మరిన్ని ట్రోఫీలు అందించడానికి సహాయపడతారని ఆశిస్తున్నా. గతంలో అత్యుత్తమ ప్రదర్శన చేసినా పెద్ద ట్రోఫీలు గెలవలేకపోయామని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు చెబుతున్నా. ఈ కుర్రాళ్లు అద్భుతంగా ఆడి మరిని ట్రోఫీలు గెలుస్తారని నమ్మకం ఉంది.’ అని చెప్పాడు.

హెడ్ కోచ్‌గా నిష్ర్కమణ గురించి మాట్లాడుతూ.. వచ్చే వారం తాను నిరుద్యోగిగా మారతానని నవ్వుతూ చెప్పాడు. ‘ఈ విజయం నుంచి నేను త్వరగానే ముందుకు సాగుతాను. వచ్చే వారం నేను నిరుద్యోగిగా మారతాను. ఎక్కువ దూరం ఆలోచించను. ఏదేమైనా నేను ముందుకు సాగాలనుకుంటున్నా. జీవితమంటే ఇదేనమో.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, భారత క్రికెటర్‌గా తన కెరీర్‌లో ద్రవిడ్ వరల్డ్ కప్ గెలవలేదు. హెచ్ కోచ్‌గా తన కలను నిజం చేసుకున్నాడు. 


Similar News