టీ20 వరల్డ్ కప్‌కు వేళాయే.. నేటి నుంచే మెగా ఈవెంట్

ఐపీఎల్ ముగిసిన వారం వ్యవధిలోనే మరో క్రికెట్ పండుగకు వేళైంది. భారత కాలమానం ప్రకారం నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ మొదలుకానుంది.

Update: 2024-06-01 19:54 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ ముగిసిన వారం వ్యవధిలోనే మరో క్రికెట్ పండుగకు వేళైంది. భారత కాలమానం ప్రకారం నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ మొదలుకానుంది. ఈ పొట్టి ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా, కెనడా జట్ల మధ్య ఫైట్‌తో ఈ ప్రపంచకప్‌ ప్రారంభకానుంది. ఈ నెల 29న ఫైనల్ జరగనుంది. దాదాపు నెల రోజులపాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఈ మెగా ఈవెంట్ అలరించనుంది.

ఫార్మాట్ ఇలా..

టీ20 వరల్డ్ కప్‌లో 20 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీ చరిత్రలో 20 జట్లు పాల్గొనడం ఇదే తొలిసారి. అలాగే, గత ఎడిషన్ మాదిరిగా కాకుండా అన్ని జట్లు గ్రూపు దశ నుంచే టోర్నీని మొదలుపెడతాయి. 20 జట్లను ఐదు టీమ్‌ల చొప్పున ఐదు గ్రూపులు విభజించారు. ప్రతి గ్రూపులోని ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూపు‌లో టాప్-2 జట్లు మొత్తం 8 టీమ్‌లు సూపర్-8 రౌండ్‌కు చేరుకుంటాయి. అక్కడ 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోతాయి. రెండు గ్రూపుల్లో టాప్-2 జట్లు సెమీస్‌ మ్యాచ్‌ల్లో తలపడతాయి. ఫైనల్‌ సహా మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. అమెరికా, విండీస్‌ ఆతిథ్య దేశాలుగా ఉండటంతో విభిన్న సమయాల్లో మ్యాచ్‌లు ప్రారంభకానున్నాయి.

అమెరికా‌ తొలిసారి.. విండీస్ రెండోసారి

టీ20 ప్రపంచకప్‌కు అమెరికా తొలిసారిగా ఆతిథ్యమివ్వబోతున్నది. ఇక్కడ 16 మ్యాచ్‌లు జరగనున్నాయి. న్యూయార్క్, ఫ్లోరిడా, టెక్సాస్ వేదికల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మరోవైపు, టీ20 వరల్డ్ కప్‌కు విండీస్ ఆతిథ్యమివ్వడం ఇది రెండోసారి. గతంలో 2010లో అక్కడే పొట్టి ప్రపంచకప్ జరిగింది. ఈ సారి విండీస్‌లోని 9 వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. బార్బడోస్, గయానా, సెయింట్ లూసియా, అంటిగ్వా-బార్బుడా, సెయింట్ విన్సెంట్-గ్రెనెడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో వేదికలుగా 39 మ్యాచ్‌లు జరుగుతాయి. నాకౌట్ మ్యాచ్‌లకు కరేబియన్ వేదికలు ఆతిథ్యమివ్వనున్నాయి.

ఐర్లాండ్‌తో భారత్ ప్రయాణం మొదలు

టీమ్ ఇండియా తన గ్రూపు మ్యాచ్‌లన్నీ అమెరికాలోనే ఆడనుంది. గ్రూపు ఏలో భాగమైన భారత జట్టు.. ఈ నెల 5న ఐర్లాండ్‌తో తలపడటం ద్వారా టోర్నీని మొదలుపెట్టనుంది. ఈ మ్యాచ్‌కు న్యూయార్క్ వేదిక. అదే వేదికపై ఈ నెల 9న పాకిస్తాన్‌తో, 12న అమెరికాతో తలపడనుంది. ఫ్లోరిడా వేదికగా జూన్ 15న జరిగే ఆఖరి మ్యాచ్‌లో కెనడాను ఎదుర్కోనుంది. గ్రూపులో భారత్‌కు పాక్ మినహా పెద్ద పోటీ లేకపోవడంతో సూపర్-8 రౌండ్‌కు చేరుకోవడం ఖాయమే. భారత్ మ్యాచ్‌లన్నీ రాత్రి 8 గంటలకు జరగనున్నాయి.

రెండు ప్రారంభ వేడుకలు

టీ20 ప్రపంచకప్‌ ఆరంభ వేడుకలు రెండు ఆతిథ్య దేశాల్లోనూ జరగనున్నాయి. అమెరికాలోని డల్లాస్ వేదికగా అమెరికా, కెనడా జట్ల మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించనున్నారు. మరోవైపు, గయానాలోనూ ప్రారంభ వేడుకలను జరగనున్నాయి. వెస్టిండీస్, పపువా న్యూ గునియా మ్యాచ్‌కు ముందు వేడుకలను నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది.

గ్రూపు.. జట్లు

గ్రూపు ఏ : భారత్, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా

గ్రూపు బి : ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్, ఇంగ్లాండ్

గ్రూపు సి : న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పపువా న్యూగినియా

గ్రూపు డి : బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్, సౌతాఫ్రికా, శ్రీలంక


Similar News