మరోసారి భారత్‌‌పై నోరుపారేసుకున్న ఇంజమామ్.. ఈ సారి సంచలన ఆరోపణలు

టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా జైత్రయాత్రను చూసి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ఓర్వలేకపోతున్నాడు.

Update: 2024-06-28 14:34 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా జైత్రయాత్రను చూసి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ఓర్వలేకపోతున్నాడు. భారత్‌పై నిరాధార ఆరోపణలు చేస్తూ కడుపుమంట బయటపెట్టుకుంటున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీమ్ ఇండియా బాల్ టాంపరింగ్‌కు పాల్పడిందని కూసిన అతనికి కెప్టెన్ రోహిత్ శర్మ గట్టి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. మైండ్‌ ఉపయోగించాలని గడ్డిపెట్టాడు. తాజాగా మరోసారి ఇంజమామ్ భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు.

పాక్ మీడియాతో మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రత్యేక రూల్స్ ఉన్నాయని ఆరోపించాడు. ‘రెండు సెమీస్‌లను పరిశీలిస్తే.. భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. భారత్ అన్ని మ్యాచ్‌ల్లో గెలిచింది. కాబట్టి, ఒకవేళ మ్యాచ్ రద్దయితే భారత్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ప్రతి మ్యాచ్‌కూ వేర్వేరు నిబంధనలు ఉన్నాయి.’ అని ఆరోపణలు చేశాడు. ‘క్రికెట్‌లో ప్రస్తుతం భారత్ చాలా శక్తివంతంగా ఉంది. అందుకే, ఇంగ్లాండ్ కూడా ఏం చేయలేకపోయింది. క్రికెట్‌ను ఒక శక్తి మాత్రమే నడిపిస్తోంది.’ అంటూ పరోక్షంగా బీసీసీఐని విమర్శించాడు. కాగా, టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన చేసిన పాక్ జట్టు గ్రూపు దశలోనే ఇంటిదారిపట్టిన విషయం తెలిసిందే.  

Similar News