చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. ఏకైక భారత బౌలర్‌గా ఘనత

టీ20 వరల్డ్ కప్‌లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు.

Update: 2024-06-12 19:20 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా సూపర్-8 రౌండ్‌కు చేరుకున్నది. అమెరికాను ఓడించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయడంతోపాటు తర్వాతి రౌండ్‌కు దూసుకెళ్లింది. ఆ మ్యాచ్‌లో భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్‌ చరిత్రలో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా రికార్డుకెక్కాడు. అమెరికా ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ మొదటి బంతికే ఓపెనర్ షాయన్ జహంగీర్(0)‌ను అవుట్ చేశాడు. జహంగీర్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించి గోల్డెన్ డకౌట్ చేశాడు.

పొట్టి ప్రపంచకప్‌ చరిత్రలో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీయడం ఐదోసారి. 2014 టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ బౌలర్ మష్రఫే మోర్తజా తొలిసారి ఈ ఫీట్ సాధించాడు. మొత్తంగా టీ20 క్రికెట్‌లో ఇది 71వ సారి. అర్ష్‌దీప్ మరో ఘనత కూడా సాధించాడు. తన బౌలింగ్ కోటాలో నాలుగు ఓవర్లలో 2.20 ఎకానమీతో 4 వికెట్లు తీయడంతోపాటు 9 పరుగులే ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన భారత బౌలర్‌గా నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్(4/11), హర్భజన్ సింగ్(4/12), ఆర్‌పీ సింగ్(4/13), జహీర్ ఖాన్(4/19), ప్రజ్ఙాన్ ఓజా(4/21)లను అర్ష్‌దీప్(4/9) అధిగమించాడు.


Similar News