ధోనీ కాదు.. ఆ పని నేను చేయాల్సింది.. 2011 వన్డే వరల్డ్ కప్‌పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు

ధోనీ నేతృత్వంలో టీమ్ ఇండియా 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు.

Update: 2024-06-22 16:45 GMT

దిశ, స్పోర్ట్స్ : తన జీవితంలో పశ్చాత్తాపం చెందే విషయం ఏదైనా ఉందా అంటే అది 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో మ్యాచ్‌ను ముగించకపోవడమేనని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. ధోనీ నేతృత్వంలో టీమ్ ఇండియా 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన గంభీర్(97) మ్యాచ్‌ను ముగించకముందే అవుటయ్యాడు. ఆ తర్వాత ధోనీ జట్టు విజయం లాంఛనం చేయగా.. అతను సిక్స్ కొట్టి గెలిపించడం అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్‌ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ఆ మ్యాచ్‌ను నేను ముగించాల్సింది. ఆటను పూర్తి చేయడం నా పని. కానీ, మరొకరికి వదిలేశాను. కాలాన్ని వెనక్కి తీసుకెళ్తే ఆ మ్యాచ్‌ను నేను ముగిస్తాను. ఆఖరి పరుగు చేస్తాను. ఎన్ని పరుగులు చేశానన్నది ముఖ్యం కాదు.’ అని వ్యాఖ్యానించాడు. కాగా, టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా గంభీర్ నియామకం లాంఛనమేనని వార్తలు వస్తున్నాయి. 


Similar News