దైవదర్శనానికి వెళ్లి వస్తున్న ట్రాక్టర్ బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు

దైవదర్శనం చేసుకుని ట్రాక్టర్ లో తిరుగు ప్రయాణం అయిన భక్తులు ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

Update: 2024-06-21 16:10 GMT

దిశ , జుక్కల్ : దైవదర్శనం చేసుకుని ట్రాక్టర్ లో తిరుగు ప్రయాణం అయిన భక్తులు ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగింది. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన 40 మంది భక్తులు జుక్కల్ మండలంలోని చారిత్రాత్మక కౌలాస్ కోటాలోని ఎల్లమ్మదైవ దర్శనానికి శుక్రవారం ఉదయం వెళ్లారు. అక్కడ దేవుడికి బోనాలు సమర్పించి అక్కడే బోజనాలు చేసి తిరిగి బిచ్కుందకు వస్తుండగా జుక్కల్ చౌరస్తాలో వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సంఘటనలో అంజలి, వెంకవ్వ అనే మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. పది మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.

అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంలో గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని జుక్కల్ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని వాదనలు ఉన్నాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో బిచ్కుంద మండల కేంద్రంలో తీవ్ర విషాదం ఛాయలు నెలకొన్నాయి. గాయపడిన వారు బంధువులలో తమ వారి ఆరోగ్య పరిస్థితి విషయంలో ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం విషయం తెలిసిన స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఘటనపై ఆరా తీశారు.


Similar News