అయోధ్య రామయ్యకు కేజ్రీవాల్, మాన్ ప్రత్యేక పూజలు
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం కుటుంబ సమేతంగా అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం కుటుంబ సమేతంగా అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నారు. ఈసందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి కుటుంబాలు దాదాపు గంటా 15 నిమిషాల పాటు రామమందిరం ప్రాంగణంలోనే గడిపాయి. కేజ్రీవాల్, మాన్‌లకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మధ్యాహ్న భోజన ఆతిథ్యం ఇచ్చారని ఆప్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సభజీత్ సింగ్ తెలిపారు. అనంతరం ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేసిన అరవింద్ కేజ్రీవాల్.. ‘‘ఇవాళ నాకు రామ్‌లల్లా దర్శన భాగ్యం కలిగింది. రామ మందిరంలో ప్రార్థనలు చేసిన తర్వాత నేను అపారమైన మనశ్శాంతిని పొందాను. దాని గురించి మాటల్లో చెప్పలేను’’ అని పేర్కొన్నారు. ‘‘దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం విలసిల్లాలని రామాలయంలో ప్రార్థించాం. మనదేశం విభిన్న రంగుల పూలగుత్తి లాంటిది. ఇక్కడ అన్ని మతవిశ్వాసాల వారు ఉంటారు. అందరం కలిసిమెలిసి పండుగలన్నీ జరుపుకుంటాం’’ అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చెప్పారు.