910 ఎకరాల ‘హౌసింగ్ ల్యాండ్స్’.. రెడీ ఫర్ సేల్
రాష్ట్రంలోని హౌసింగ్ బోర్డు భూముల అమ్మకానికి రంగం సిద్ధమైంది. భూములు అమ్మనున్నట్టు ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాటిని ఇప్పుడు అమ్మక తప్పని పరిస్థితి. దశాబ్దాల కిందట రైతుల నుంచి సేకరించి, గృహ నిర్మాణ శాఖ ఆధీనంలో ఉంచుకొన్న భూములను ఇప్పుడు రూ.కోట్లకు వేలం వేయనున్నది. ఈ భూమి 910 ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారీ బడ్జెట్ నేపథ్యంలో భూముల అమ్మకమే అనివార్యంగా కనిపిస్తున్నది. ఈ భూములపై […]
రాష్ట్రంలోని హౌసింగ్ బోర్డు భూముల అమ్మకానికి రంగం సిద్ధమైంది. భూములు అమ్మనున్నట్టు ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాటిని ఇప్పుడు అమ్మక తప్పని పరిస్థితి. దశాబ్దాల కిందట రైతుల నుంచి సేకరించి, గృహ నిర్మాణ శాఖ ఆధీనంలో ఉంచుకొన్న భూములను ఇప్పుడు రూ.కోట్లకు వేలం వేయనున్నది. ఈ భూమి 910 ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారీ బడ్జెట్ నేపథ్యంలో భూముల అమ్మకమే అనివార్యంగా కనిపిస్తున్నది. ఈ భూములపై ఇప్పటికే ఇద్దరు మంత్రులు కన్నేశారు. ఖరీదైన భూములన్నీ వారి ఆధీనంలోనే ఉన్నట్టు తెలుస్తున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ హౌసింగ్‌బోర్డు భూముల అమ్మకాలపై ప్రభుత్వం గత బడ్జెట్‌లోనే క్లారిటీ ఇచ్చింది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాటిని వాయిదా వేసుకుంది. అదే ప్రభుత్వానికి కలిసి వస్తోంది. 2020-21 బడ్జెట్ సందర్భంగా ఈ భూములను అమ్ముతామని తేల్చి చెప్పింది. అయితే అప్పుడు అంచనా దాదాపు రూ.40 వేల కోట్లు వేసుకుంది. కానీ ప్రస్తుతం ఆ భూ అమ్మకాల నుంచి రూ. 60 వేల కోట్లు రాబట్టుకునేందుకు ప్రాథమికంగా అంచనా వేసింది. హౌసింగ్‌బోర్డు భూములపై ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో బోర్డు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. వీటిలో దాదాపుగా 839 ఎకరాలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి. అవి ఇప్పుడు అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా మారాయి. వీటిపై రూ.50 వేల కోట్లు రాబట్టుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. వరంగల్, నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం, మెదక్ వంటి ఉమ్మడి జిల్లాల పరిధిలో మిగిలిన భూమి ఉంది. దీని ద్వారా సుమారు రూ.10 వేల కోట్లు వస్తుందని అంచనా వేస్తోంది. వేలం ద్వారానే వీటిని అమ్మకం చేయాలని అధికారులు నివేదికలో సూచించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇలా మొత్తం 910 ఎకరాలను అమ్మేందుకు సిద్ధం చేస్తున్నారు.
ఆ భూములపై వారి కన్ను
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో భూముల వివరాలను ఇప్పటికే ప్రభుత్వ పెద్దలకు నివేదికలందించారు. హౌసింగ్‌బోర్డు భూములను మొత్తంగా వేలం వేసేందుకు కేబినెట్ సబ్‌కమిటీ గతంలోనే సూచించింది. అయితే కొన్నిచోట్ల మాత్రం కొందరు మంత్రులు, ఎంపీలు ఈ భూములపై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా ఇద్దరు మంత్రులు ఈ భూములను ఆధీనంలో పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. తమ భూములను ఆనుకుని ఉన్న హౌసింగ్‌బోర్డు భూములను వారే కొనుగోలు చేసుకునేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఒక మంత్రి ముందే ఆరు ఎకరాల భూమిని ఆధీనంలో పెట్టుకున్నారని, తన ఫాంహౌస్కోసం వాస్తుపరంగా కలిసి వచ్చే అవకాశం ఉండటంతో తానే కొనుగోలు చేసేందుకు సిద్ధమంటూ అధికారులకు చెప్పినట్టు సమాచారం. మరో మంత్రి పక్కనే తన భూమి ఉండటంతో కలిసి వస్తుందని, దీంతో వందల ఎకరాల్లో విద్యా సంస్థను నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. మరో ఎంపీ 20 ఎకరాల హౌసింగ్‌బోర్డు భూమి కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో ఒక ఇండస్ట్రీకి చెందిన భూమిని కొనుగోలు చేసిన సదరు ఎంపీ పక్కనే ఉన్న హౌసింగ్‌బోర్డు భూమిని కొని, అతిపెద్ద వెంచర్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రభుత్వం వేలానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ భూముల కోసం ఎవరూ పోటీ రావద్దంటూ ఇప్పటి నుంచే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఒకవేళ ప్రభుత్వ పెద్దలతో ఒప్పందం కుదిరితే వేలం కాకుండా మార్కెట్ ధరలకనుగుణంగా కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకే సవరణలు?
భూముల మార్కెట్ విలువలను సవరించనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో స్పష్టం చేసింది. దీనిలో భాగంగా రిజిస్ట్రేషన్‌శాఖ నుంచి ఆదాయన్ని రెండింతలు చేసి చూపించారు. గతేడాది రూ.6 వేల కోట్లు ఈ శాఖ నుంచి రాగా, ఈసారి రూ.12,500 కోట్లుగా అంచనా వేశారు. దీంతో భూముల మార్కెట్విలువలను పెంచుతారని అధికారులు వివరిస్తున్నారు. ప్రభుత్వం హౌసింగ్ బోర్డు భూములను అమ్మకానికి పెడుతున్న నేపథ్యంలోనే పెంపునకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.