64 ఏళ్ల వయసులో.. ఎంబీబీఎస్‌ ‘కిశోరం’

దిశ, వెబ్‌డెస్క్ : బ్యాంకు ఉద్యోగిగా రిటైర్ అయ్యేంతవరకు అలుపెరగని జీవితం ఆయనది. ప్రస్తుతం ఆరు పదుల వయసు దాటినా, తన ఉద్యోగ జీవితంలో అందరి మన్ననలు అందుకున్నా, కుటుంబ బాధ్యతలన్నీ నెరవేర్చినా.. ఎక్కడో ఓ మూలన లక్ష్యాన్ని విస్మరించానన్న అసంతృప్తి మాత్రం అలాగే ఉండిపోయింది. మెడలో స్టెతస్కోప్, ఒంటిపై డాక్టర్ కోట్ వేసుకోవాలనుకున్న అతడి చిరకాల కోరిక నిలువనీయలేకపోవడంతో ఆ 64 ఏళ్ల రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి.. మళ్లీ పుస్తకాలు ముందేసుకున్నాడు. ఇష్టంతో కష్టపడి చదివి […]

Update: 2020-12-26 08:14 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బ్యాంకు ఉద్యోగిగా రిటైర్ అయ్యేంతవరకు అలుపెరగని జీవితం ఆయనది. ప్రస్తుతం ఆరు పదుల వయసు దాటినా, తన ఉద్యోగ జీవితంలో అందరి మన్ననలు అందుకున్నా, కుటుంబ బాధ్యతలన్నీ నెరవేర్చినా.. ఎక్కడో ఓ మూలన లక్ష్యాన్ని విస్మరించానన్న అసంతృప్తి మాత్రం అలాగే ఉండిపోయింది. మెడలో స్టెతస్కోప్, ఒంటిపై డాక్టర్ కోట్ వేసుకోవాలనుకున్న అతడి చిరకాల కోరిక నిలువనీయలేకపోవడంతో ఆ 64 ఏళ్ల రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి.. మళ్లీ పుస్తకాలు ముందేసుకున్నాడు. ఇష్టంతో కష్టపడి చదివి నీట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. అతడే ఒడిషాకు చెందిన జైకిశోర్ ప్రధాన్. దేశంలోనే అత్యంత లేటు వయసులో వైద్య విద్యలో చేరిన కిశోర్ జర్నీ మీకోసం..

ప్రతి ఒక్కరికి ఏదో ఓ కల ఉంటుంది. కానీ కుటుంబ పరిస్థితులో లేదా అప్పుడున్న స్థితిగతులో మన కెరీర్‌ను మార్చేస్తాయి. కిశోర్ జీవితంలోనూ అలానే జరిగింది. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా ఆరుపదుల వయసులోనూ కష్టపడి తాను అనుకున్నది సాధించాడు. ఒడిషా బార్‌గఢ్‌కు చెందిన కిశోర్ చిన్నప్పటి నుంచే డాక్టర్ కావాలని కలలు కన్నాడు. అందుకోసం తీవ్రంగా శ్రమించి, 1974లో ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయగా, క్వాలిఫై కాలేదు. మరో ఏడాది వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో బీఎస్‌సీ ఫిజిక్స్ హానర్స్‌లో జాయిన్ అయ్యాడు. కానీ తన ఎంబీబీఎస్ కల మాత్రం ఆయన్ను ఎప్పుడూ వెంటాడేది. డిగ్రీ పూర్తయ్యాక టీచర్‌గా, ఆ తర్వాత టెలికాం ఉద్యోగిగా చేసిన కిశోర్.. 1983లో ఎస్‌బీఐలో ఉద్యోగం సాధించాడు.

ఆ క్రమంలోనే 15 ఏళ్లు బ్యాంక్ ఉద్యోగం చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని, మళ్లీ ఎంబీబీఎస్కు ప్రిపేర్ అవ్వాలనుకున్నాడు. కానీ కుటుంబ బాధ్యతల వల్ల అది సాధ్యం కాలేకపోయింది. ఆ తర్వాత ట్రై చేద్దామన్నా వైద్యవిద్య ప్రవేశ పరీక్షకు గరిష్ట వయసు పరిమితి ఉండటంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అయితే 2019లో సుప్రీంకోర్టు మెడిసిన్ ప్రవేశాలకు వయోపరిమితి ఎత్తేయడంతో కిశోర్ కలలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఈ ఏడాది నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి, ర్యాంకు సాధించడంతో భువనేశ్వర్‌లోని వీర్ సురేంద్రసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్‌లో ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయ్యాడు.

నాలుగు దశాబ్దాలపాటు చదువుకు దూరమైన కిశోర్.. 64 ఏళ్ల వయసులో నీట్ క్రాక్ చేయడమే కాకుండా, మెడిసిన్ చేయడం నిజంగా అభినందనీయమే కాదు, ఆయన సంకల్పం నేటి తరానికి స్ఫూర్తిదాయకం కూడా. తాను బతికున్నంత కాలం ప్రజలకు సేవ చేస్తానని కిశోర్ చెబుతున్నాడు.

Tags:    

Similar News