షాకింగ్ : మూడేళ్లలో 50వేల ఉద్యోగాలు పోయినయ్
దిశ, తెలంగాణ బ్యూరో : “27 అక్టోబర్ 2017 తెలంగాణ శాసనసభ. రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్, టీడీపీ దుర్మార్గమైన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని తీసుకువచ్చాయి. ఉద్యోగులు అర్ధాకలితో పనిచేసే దుష్ట సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాయి. శాసనసభలో కూడా కొంతమంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ఉద్యోగులున్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ వ్యవస్థలను రూపు మాపాలని, అర్ధాకలితో రాష్ట్రంలో ఎవరూ పని చేయకూడదని సిన్సియర్‌గా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక ఎఫర్ట్‌ను ప్రారంభించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరిని పర్మినెంట్ చేయాల్సి వస్తే రూల్ […]
దిశ, తెలంగాణ బ్యూరో : “27 అక్టోబర్ 2017 తెలంగాణ శాసనసభ. రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్, టీడీపీ దుర్మార్గమైన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని తీసుకువచ్చాయి. ఉద్యోగులు అర్ధాకలితో పనిచేసే దుష్ట సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాయి. శాసనసభలో కూడా కొంతమంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ఉద్యోగులున్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ వ్యవస్థలను రూపు మాపాలని, అర్ధాకలితో రాష్ట్రంలో ఎవరూ పని చేయకూడదని సిన్సియర్‌గా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక ఎఫర్ట్‌ను ప్రారంభించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరిని పర్మినెంట్ చేయాల్సి వస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటిస్తాం. అన్యాయం జరగనీయం” అంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఈ పద్ధతిన పనిచేస్తున్న దాదాపు లక్షన్నర ఉద్యోగులు సంబురపడ్డారు. కానీ పరిస్థితి మారింది. సీఎం కేసీఆర్ అన్నట్టు గానే.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ఉద్యోగులను లేకుండా చేస్తున్నారు. కొలువులను పీకేసి ఇంటికి పంపిస్తున్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ వ్యవస్థనే ఉండదన్న సీఎం.. ఇప్పుడు అన్ని శాఖల్లో అదే పాటిస్తున్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలే ఉండవని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్ ఇప్పుడు వారిని తొలగిస్తున్నారు సరే.. ఆ స్థానంలో రెగ్యులర్ పోస్టులు ఇవ్వడం లేదు.. పైగా ఈ మధ్య మళ్ళీ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ నియామకాలే చేస్తున్నారు. ఉన్నవాళ్లలో ఎవరిమీద ఎప్పుడు వేటు పడుతుందో.. ఎందుకు పడుతుందో.. కూడా తెలియని ఆందోళన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.
52,515 మందిని తొలగించారు..
రాష్ట్రంలో కొత్తగా 50 వేల కొలువుల భర్తీ ఏమో కానీ… ఈ మూడున్నరేండ్లలో మాత్రం 52 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రోడ్డున పడేశారు. ప్రభుత్వ శాఖల్లో ఏండ్ల నుంచి పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం క్రమేణా తొలగిస్తున్నది. దీంతో వేలాది మంది చిరుద్యోగులు తాజాగా రోడ్డున పడుతున్నారు. పీఆర్సీ నివేదిక ప్రకారం ఆయా ప్రభుత్వ శాఖల్లో 1,20,367 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు. వీరంతా ఉన్నత చదువులు చదువుకున్న వారే. తాము చదువుకున్న స్థాయికి కొలువులు రాకపోవడం, ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో దొరికిందే చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మెడపై కత్తిపెట్టి తీసేస్తున్నది. కొన్ని శాఖల్లో రెన్యూవల్ చేయకుండా తొక్కిపెడుతున్నది. రాష్ట్రంలో 2018 నుంచి ఇప్పటి వరకు మొత్తం 52,515 మంది ఉద్యోగులను ప్రభుత్వం ఇంటికి పంపించింది. వీరిని ఎప్పుడు, ఎందుకు తీసేస్తున్నారనే సమాచారం కూడా ఇవ్వకుండా తొలగించింది.
సాక్షర భారత్‌తో మొదలు..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నిష్పత్తి 60:40గా ఉండే సాక్షర భారత్ మిషన్‌లో సమన్వయ కర్తలు 15 ఏళ్లుగా తాత్కాలిక ప్రాతిపదికన పని చేశారు. గ్రామ సమన్వయ కర్తలకు నెలకు రూ.2,000, మండల, జిల్లా సమన్వయ కర్తలకు రూ.6,000 చొప్పున గౌరవ వేతనం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచే రాష్ట్ర ప్రభుత్వం ఈ వేతనాలు ఇచ్చింది. అయితే 2018లో ప్రభుత్వం ఉన్నపళంగా వారిని ఇంటికి పంపించింది. తొలగింపునకు గురైన సమన్వయ కర్తల్లో 15 నుంచి 20 ఏళ్లకుపైగా పని చేస్తున్నారు. వారికి వచ్చే వేతనం అత్యంత స్వల్పమే అయినా రాష్ట్ర ప్రభుత్వ పనికూడా ఉండటంతో వేతనాలు పెరుగుతాయని ఆశగా ఎదురుచూసినా… ఒకే ఒక్క నోటీసుతో తొలగించారు. పలుమార్లు సీఎం, మంత్రులకు మొరపెట్టుకున్నా… కాళ్లపై పడ్డా వారిని తీసుకోలేదు.
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు..
గ్రామీణ ప్రాంతాల్లోని అతి ప్రధానమైన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం నిర్ధాక్షణ్యంగా తొలిగించింది. ఇటీవల కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు తమను తీసుకోవాలంటూ అమాత్యులు, అధికార పార్టీ నేతల ముందు కొంగు చాపి వేడుకున్న పరిస్థితి వారి ధైన్యాన్ని చూపించింది. కానీ వారిని తీసుకునే ప్రసక్తే లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించింది. మొత్తం 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఇంటికి పంపించారు. ఈ భారాన్ని మొత్తం పంచాయతీ కార్యదర్శులపై పెట్టారు. ఉపాధి పనులను చూపించడం, కూలీల వేతనాలు ఇవ్వడం వంటి ప్రధానమైన పనులు చేసే ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడంతో గ్రామాల్లో ఉపాధి పనులు తగ్గుతున్నాయి.
మిషన్ భగీరథలో 709 మంది..
దేశానికే తలమానికం అని చెబుతున్న మిషన్ భగీరథలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర చాలా కీలకం. ట్యాంకులు కట్టించే దగ్గర నుంచి పైపులైన్లను వేయించే పనుల పర్యవేక్షణ వరకు ప్రతి ఒక్కటీ దగ్గరుండి పనిచేశారు. ఈ పథకంలో ముందుగా కొంతమంది ఇంజినీర్లు, జూనియర్ అసిస్టెంట్లను నియమించారు. వీరిని పర్మినెంట్ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ, ఉన్నట్టు ఏ నోటీసూ లేకుండా గతేడాది జూన్ 30 నుంచి తీసేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేసింది. దీంతో 709 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఉద్యోగాలు లేకపోవడంతో ఇంజినీరింగ్ చదువులు చదివిన వీరంతా కూలీలుగా మారారు. ఇక ఉద్యానవన శాఖలోని 315 మందిని కూడా గతేడాది మే నెలలో బయటకు పంపించారు. సాంఘిక సంక్షేమ శాఖ, ఆర్టీసీ, విద్యాశాఖ తదితర ఇతర ప్రభుత్వ విభాగాల్లో మరో 3 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఇంటికి పంపించింది.
విద్యావాలంటీర్లు ఉన్నట్టా.. లేనట్టా..?
రాష్ట్రంలోని విద్యాశాఖలో ఉపాధ్యాయ పోస్టులు వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. చాలా పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేరు. కొన్నిచోట్ల విద్యావాలంటీర్లను పెట్టుకుని సాగిస్తున్నారు. అయితే, రాష్ట్రంలోని 16,400 మంది విద్యావాలంటీర్లు గతేడాది మే నుంచి ఉద్యోగాల్లో ఉన్నారో.. పీకేశారో తెలియని పరిస్థితి నెలకొంది. గత ఏడాది మే నుంచి వారికి రెన్యూవల్ ఉత్తర్వులు విడుదల చేయలేదు. దీంతో నో వర్క్… నో పే పద్ధతి అన్నట్టుగా మారింది. ఇప్పటికే పలుమార్లు తమ పరిస్థితి ఏమిటో తెలపాలని విజ్ఞప్తి చేశారు. కానీ అధికారుల నుంచి సమాధానం రావడం లేదు.
పొగబెట్టి పంపిస్తున్నారు..
ఇక జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాల్సి వస్తుందనే నెపంతో వారిని ఇంటికి పంపించేందుకు చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి. పనిభారం ఎక్కువవుతోంది. గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ పని నుంచి అధికారి పనివరకు ఒక్కరే చేయాల్సి వస్తోంది. దీంతో చాలా మంది కొలువులకు రామంటున్నారు. మరికొద్ది నెలల్లో వారిని రెగ్యులర్ చేయాల్సిన పరిస్థితుల్లో నోటీసులు, మెమోలు ఇచ్చి బయటకు పంపుతున్నారు. దీంతో రాష్ట్రంలో ముందుగా 9,355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లోకి వస్తే.. దాదాపుగా 2 వేలకుపైగా విధులకు వెళ్లడం లేదు. తాజాగా కరోనా కష్టకాలంలో పని చేసిన స్టాఫ్ నర్సులను ప్రభుత్వం తొలగించింది. అవసరమున్నప్పుడు వారి సేవలను వినియోగించుకున్న ప్రభుత్వం… ఇప్పుడు 1640 మందిని తీసేసింది. దీంతో వారు రోజూ కార్యాలయాలు, పార్టీ నేతల చుట్టూ తిరుగుతూ వేడుకుంటున్నారు.
ప్రభుత్వం తొలగించిన ఉద్యోగులు..
సర్వశిక్ష అభియాన్ (సాక్షర భారత్) 21,200
ఫీల్డ్ అసిస్టెంట్లు 7,651
మిషన్ భగీరథ 709
నర్సులు 1640
హార్టికల్చర్ 315
సోషల్ వెల్ఫేర్, విద్యాశాఖ, ఆర్టీసీలో తొలగించిన ఉద్యోగులు 2,640
సస్పెన్షన్‌తో ఉద్యోగాలు మానేసిన జూనియర్ పంచాయతీ అధికారులు 2000
2020 నుంచి రెన్యూవల్ చేయని విద్యా వాలంటీర్లు 16,400
మాకు అవకాశం కల్పించండి :
ఏండ్ల తరబడి మిషన్ భగీరథలో పనిచేశాం. ఇంజినీరింగ్ చదువుకుని మిషన్ భగీరథలో అవకాశం వస్తే విధుల్లో చేరాం. కొన్ని సందర్భాల్లో మమ్మల్ని పర్మినెంట్ చేస్తామన్నారు. కానీ గతేడాది ఉన్నపళంగా వెళ్లిపోవాలని రాత్రికి రాత్రే నోటీసులిచ్చారు. ఎంతమందిని వేడుకున్నా కనికరించడం లేదు. ఇరిగేషన్లో కొత్తగా వర్క్ ఇన్స్పెక్టర్లను నియమించుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో మాకు అవకాశం కల్పించాలి.
-వై.వియన్, మిషన్ భగీరథ ఎంప్లాయీస్ స్టేట్ జనరల్‌సెక్రెటరీ
కొత్త ఉద్యోగాల కంటే తొలగించినవే ఎక్కువ :
రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. కొత్తగా 50 వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. దాని కంటే ముందుగా 50వేల మందిని తొలిగించారు. ఏండ్ల నుంచి ఉద్యోగాలు చేస్తున్న వారిని ఇంటికి పంపిస్తున్నారు. అంటే ఒకరిని తీసివేస్తేనే ఇంకొక్కరికి అవకాశం ఇస్తారా. రాష్ట్రంలో తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి. పీఆర్సీ నివేదిక ప్రకారం దాదాపు రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి.