కరోనా నివారణకు 21 మందులు
న్యూయార్క్: ఒకవైపు కరోనా టీకాపై పరిశోధనలు ఊపందుకున్న తరుణంలో మరోవైపు దానికి చికిత్స కోసం అధ్యయనాలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికి రెమ్‌డెసివిర్ సహా పలు మందులు కరోనా పేషెంట్లకు అత్యవసర పరిస్థితుల్లో ఇవ్వడానికి కొన్ని దేశాల్లో అనుమతలు పొందిన సంగతి తెలిసిందే. ఇలాగే, కరోనాను ఎదుర్కోవడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులను గుర్తించే అధ్యయనాలు జోరుగా సాగుతున్నాయి. ప్రపంచదేశాలకు చెందిన ఓ శాస్త్రజ్ఞుల బృందం ఈ పనిలో కీలక అడుగులు వేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 21 […]
న్యూయార్క్: ఒకవైపు కరోనా టీకాపై పరిశోధనలు ఊపందుకున్న తరుణంలో మరోవైపు దానికి చికిత్స కోసం అధ్యయనాలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికి రెమ్‌డెసివిర్ సహా పలు మందులు కరోనా పేషెంట్లకు అత్యవసర పరిస్థితుల్లో ఇవ్వడానికి కొన్ని దేశాల్లో అనుమతలు పొందిన సంగతి తెలిసిందే. ఇలాగే, కరోనాను ఎదుర్కోవడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులను గుర్తించే అధ్యయనాలు జోరుగా సాగుతున్నాయి.
ప్రపంచదేశాలకు చెందిన ఓ శాస్త్రజ్ఞుల బృందం ఈ పనిలో కీలక అడుగులు వేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 21 మందులు కరోనాను కట్టడి చేయడంలో సహాయపడుతాయని ప్రకటించింది. ముఖ్యంగా నాలుగు డ్రగ్స్ రెమ్‌డెసివిర్‌తో కలిపి ఇస్తే మెరుగైన ఫలితాలనివ్వచ్చని గుర్తించినట్టు జర్నల్ నేచర్‌లో ఆ బృందం వివరించింది. ఈ నాలుగు మందులు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నట్టు పేర్కొంది.
తమ విశ్లేషణ ప్రకారం క్లొఫాజిమైన్, హన్ఫాంగ్‌చిన్ ఏ, ఎపిలిమడ్, ఓనో 5334లు కరోనా చికిత్సకు మెరుగ్గా ఉండే అవకాశమున్నదని భావిస్తున్నట్టు యూఎస్ కాలిఫోర్నియాలోని సాన్‌ఫోర్డ్ బర్న్‌హమ్ ప్రెబిస్ మెడికల్ డిస్కవరీ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ సుమిత్ చందా చెప్పారు. కరోనా నుంచి కోలుకునే సమయాన్ని రెమ్‌డెసివిర్ తగ్గించిందని, అయితే, ఈ డ్రగ్ అందరిపై సానుకూల ప్రభావాన్ని చూపడం లేదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరాళనృత్యం చేస్తున్న కరోనాను అడ్డుకోవడానికి వేగంగా చికిత్స పద్ధతులను కనుగొనాల్సి ఉన్నదని, ముఖ్యంగా అందుబాటులో ఉన్న మందులపై పరిశోధనలు చేయడం కీలకమని అధ్యయనంలో పాల్గొన్న సుమిత్ వివరించారు. రెమ్‌డెసివిర్‌కు సప్లిమెంట్ మందులనూ గుర్తించడం కీలకమేనని చెప్పారు.
అధ్యయనంలో భాగంగా ప్రస్తుతం అందుబాటులోని అనేక మందులను పరిశీలించారు. కరోనాకు విరుగుడుగా పనిచేసే మందుల కోసం 12వేల డ్రగ్స్‌ను పరీక్షించారు. ఇందులో భాగంగానే భారీగా టెస్టులు చేశారు. కరోనా సోకిన మనిషి ఊపిరితిత్తుల కణాలనూ ఈ టెస్టులకు వినియోగించుకున్నారు. మనిషి దేహంలో కరోనా ఎన్నో రెట్లు పెరగకుండా ప్రస్తుతం గుర్తించిన 21 మందులు నిరోధించే అవకాశమున్నట్టు శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఈ 21 కంపౌండ్లతో మనిషి కణాలను పోలి ఉండే ఇతర జంతువుల ఊపిరితిత్తుల కణాలు, ఇతర జీవకణాలపై ప్రస్తుతం ప్రయోగాలు జరుపుతున్నారు.