ICC World Cup 2023: ఫోటో షూట్‌లో రోహిత్, కమిన్స్.. పురాతన మెట్లబావి వద్ద వరల్డ్ కప్ ట్రోఫీ
ICC World Cup 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా టీమిండియా vs ఆసీస్ మధ్య ఫైనల్ ఫైట్ రేపు జరగనుంది.
దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా టీమిండియా vs ఆసీస్ మధ్య ఫైనల్ ఫైట్ రేపు జరగనుంది. ఫైనల్ ఫైట్‌కు కౌంట్‌డౌన్ మొదలవ్వడంతో భారత, ఆస్ట్రేలియా కెప్టెన్లతో శనివారం ఐసీసీ ఫొటోషూట్ నిర్వహించింది. గుజరాత్‌లోని పురాతన అడలాజ్ మెట్లబావి(Adalaj Step Well) దగ్గర వరల్డ్ కప్ ట్రోఫీతో రోహిత్ శర్మ, పాట్ కమిన్స్ ఫొటోలకు పోజిచ్చారు. ఈ ఫొటోకు ‘ఇద్దరు కెప్టెన్లు, ఒక ట్రోఫీ. ఇద్దిరిలో ఎవరు అల్టిమేట్ ప్రైజ్‌ను ఒడిసిపట్టుకుంటారు?’ అని క్యాప్షన్ రాసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. క్రికెట్ చరిత్రలో భారత్‌కు ఇది నాలుగో వరల్డ్ కప్ ఫైనల్. అయితే సొంత గడ్డపై మాత్రం రెండోది. ఇక ఆస్ట్రేలియాకు ఇది ఎనిమిదో వరల్డ్ కప్ ఫైనల్. ఈసారి కప్పు కొడితే టీమిండియా ఖాతాలో మూడో ట్రోఫీ చేరుతుంది. ఇరుజట్లకు మాత్రం ఇది రెండో టైటిల్ పోరు. 2003లో గంగూలీ సేనను రికీ పాంటింగ్ బృందం చిత్తుగా ఓడించి ట్రోఫీని ఎగరేసుకుపోయిన విషయం తెలిసిందే.
దాంతో 20 ఏండ్ల తర్వాత ఆ ఓటమికి బదులు తీర్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఫామ్ పరంగా చూస్తే టీమిండియా.. ఆసీస్ కంటే మెరుగ్గా ఉంది. కానీ, ఐసీసీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాకు ఘనమైన రికార్డు ఉంది. ఫైనల్లో ఆ జట్టు ఓటమన్నదే ఎరుగదు. టోర్నీ ఏదైనా కప్పుతో ఇంటికి తిరిగివెళ్లడమే ఆ జట్టుకు తెలుసు. అయితే.. 2003 జట్టుకు ఇప్పటి జట్టుకు ఎంతో తేడా ఉంది. ఈసారి రోహిత్ సేన ట్రోఫీని ముద్దాడాలని కోట్లాదిమంది భారతీయులు కోరుకుంటున్నారు.