World Cup 2023 Qualifiers: వన్డే వరల్డ్ కప్‌కు నెదర్లాండ్స్ క్వాలిఫై..

వరల్డ్ కప్ క్వాలిఫైర్ మ్యాచ్‌లో భాగంగా స్కాట్లాండ్, నెదర్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్ నాలుగు వికెట్లతో విజయం సాధించింది.

Update: 2023-07-06 15:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్కాట్లాండ్‌తో జరిగిన వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో డచ్‌ జట్టు నాలుగు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో (బౌలింగ్‌లో 5 వికెట్లు, బ్యాటింగ్‌లో సెంచరీ) మెరిసిన బాస్‌ డీ లీడే హైలెట్‌గా నిలిచాడు. దీంతో క్వాలిఫయర్‌-2 హోదాలో నెదర్లాండ్స్‌ వరల్డ్‌కప్‌కు పదో జట్టుగా అర్హత సాధించింది. ఇక క్వాలిఫయర్‌-1గా శ్రీలంక ఇప్పటికే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించగా.. తాజాగా డచ్‌ జట్టు క్వాలిఫయర్‌-2 హోదాలో వన్డే వరల్డ్‌కప్‌కు వెళ్లనుంది. అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ జరగనుంది. భారత్‌ గడ్డపై ఈ మెగా సంగ్రామం జరగనుంది.

ఈ మ్యాచ్‌ మొదట బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. బ్రాండన్‌ మెక్‌ముల్లన్‌ 110 బంతుల్లో 106 పరుగులు సెంచరీ చేయగా.. కెప్టెన్‌ రిచీ బెరింగ్‌టన్‌ (64), థామస్‌ మెకింటోష్‌ (38) పరుగులు చేశారు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో బాస్‌ డీ లీడే 5 వికెట్లు తీయగా.. రెయాన్‌ క్లీన్‌ 2, వాన్‌బీక్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 42.5 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను రీచైంది. నెదర్లాండ్స్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ బాస్‌ డీ లీడే(92 బంతుల్లో 123 పరుగులు) సంచలన సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్‌ విక్రమ్‌జిత్‌ సింగ్‌ (40), ఆఖర్లో సకీబ్‌ జుల్పికర్‌ (33) నాటౌట్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 


Similar News