ICC World Cup 2023: సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి ఎవరు? భారత్-పాకిస్తాన్ మరోసారి ఢీకొనే ఛాన్స్ ఉందా..?
ICC World Cup 2023లో టీమిండియా దూసుకెళుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో టీమిండియా దూసుకెళుతోంది. టైటిల్ ఫేవరట్‌గా టోర్నీ మొదలుపెట్టిన టీమిండియా అత్యుత్తమ ప్రదర్శనతో ఎలాంటి ప్రత్యర్థినైనా చిత్తు చేస్తోంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండు విభాగాల్లోనూ రాణిస్తూ.. ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటుతూ పాయింట్ల పట్టికలో తొలి స్థానాన్ని సాధించింది. సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఆడిన ఎనిమిది మ్యాచ్‌లూ గెలిచి 16 పాయింట్లు సాధించిన ఇండియా, తొమ్మిదో మ్యాచ్ నెదర్లాండ్స్‌తో నవంబరు 12న ఆడనుంది. నాలుగు సెమీస్ బెర్తుల్లో మరో స్థానాన్ని సౌతాఫ్రికా దక్కించుకొంది. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం నాలుగు జట్లు- ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ పోరాడుతున్నాయి.
ప్రపంచ కప్ టోర్నీ నిబంధనల ప్రకారం.. ఫస్ట్ ప్లేస్ సాధించిన జట్టు నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో, రెండో స్థానానికి చేరుకున్న టీం మూడో స్థానంలో ఉన్న టీంతో సెమీ ఫైనల్స్‌లో తలపడాల్సి ఉంటుంది. మంగళవారం వరకున్న పాయింట్ల పట్టిక ప్రకారం.. ఆస్ట్రేలియాకు ఇంకా సెమీస్‌లో చోటు ఖాయం కాలేదు. అయితే ఆస్ట్రేలియా రెండో స్థానం లేదా మూడో స్థానం లేదా నాలుగో స్థానాన్ని దక్కించుకొనే అవకాశం ఉంది. దీంతో నంబర్ 1 స్థానంలో ఉన్న ఇండియాతో తలపడబోయే జట్టు ఏదనేది చాలా ఆసక్తికరంగా మారింది. రెండు సెమీస్ స్థానాల కోసం పోటీపడుతున్న ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్‌లలో ఏ జట్టు అవకాశాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
ఆస్ట్రేలియా:
ఏడు మ్యాచులు ఆడిన ఆస్ట్రేలియా ప్రస్తుతం 10 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. నవంబరు 7న అఫ్గానిస్తాన్‌తో, 11న బంగ్లాదేశ్‌తో ఆసీస్ తలపడనుంది. వీటిలో ఒక్క మ్యాచ్ గెలిచినా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. రెండు మ్యాచ్‌లలో గెలిస్తే పట్టికలో రెండో స్థానం దక్కుతుంది. అయితే రెండింటిలోనూ ఓడి, పాకిస్తాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్‌లతో పోలిస్తే రన్ రేట్ కలిసొచ్చి, సెమీస్ చేరినా, భారత్‌తో తలపడాల్సి రావొచ్చు. న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్తాన్ జట్లు తలా 8 పాయింట్లతో ఉన్నాయి. మూడు జట్లకు సమాన పాయింట్లు ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్ ఆధారంగా చూస్తే న్యూజిలాండ్ జట్టు (+0.398) ముందంజలో ఉంది. ఆ తర్వాత పాకిస్థాన్ (+0.036), అఫ్గాన్ జట్లు (-0.330) ఉన్నాయి.
న్యూజిలాండ్:
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లతో పోలిస్తే న్యూజిలాండ్ జట్టు ఇప్పటికీ మంచి స్థితిలోనే ఉంది. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఓటమి, కివీస్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. శ్రీలంకతో జరిగే తన తొమ్మిదో మ్యాచ్‌లో కివీస్ భారీ తేడాతో గెలిస్తే సెమీస్‌కు టికెట్ ఖాయం. అయితే నవంబర్ 9న బెంగళూరులో జరగాల్సిన ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశముంది. దీంతో ఆ రోజు వర్షం రాకూడదని కివీస్ కోరుకోవాల్సిందే. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే అది పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ జట్లకు అడ్వాంటేజ్ అవుతుంది.
పాకిస్తాన్:
పాకిస్తాన్.. భారత్, అఫ్గానిస్తాన్, సౌతాఫ్రికా జట్ల చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించే వరకు వెళ్లింది. అయితే న్యూజిలాండ్‌పై అనూహ్య విజయంతో రేసులోకి వచ్చింది. పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అంతే కాదు సెమీస్ రేసులో ఉన్న ఇతర జట్ల కంటే నెట్ రన్ రేట్ తక్కువగా ఉన్నందున ఆ మ్యాచులో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అప్పటికీ పాకిస్తాన్ సెమీస్ చేరినట్లు కాదు. మిగతా జట్ల ఫలితాల కోసం ఎదురుచూడాలి. పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే శ్రీలంక చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవాలి లేదా మ్యాచ్ రద్దవ్వాలి. పాకిస్తాన్‌కు అన్నీ కలిసొచ్చి సెమీస్ చేరితే మాత్రం భారత్‌తో తలపడాల్సి వస్తుంది.
అఫ్గానిస్తాన్:
నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించి అఫ్గాన్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కానీ ఆ టీంకు రాబోయే మ్యాచ్‌లు చాలా కఠినంగా ఉండబోతున్నాయి. వచ్చే రెండు మ్యాచ్‌లు పటిష్ట ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో ఆడాల్సి ఉంది. రెండు మ్యాచ్‌లు గెలిస్తే మిగతా జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా అఫ్గాన్, సెమీఫైనల్ చేరుతుంది. పాకిస్థాన్‌పై న్యూజిలాండ్ ఓటమి అఫ్గానిస్తాన్‌కు ఉపశమనం కలిగించేదే. అయితే రాబోయే కష్టమైన మ్యాచ్‌లను గెలవాలి. న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు తమ తదుపరి మ్యాచ్‌లలో ఓడిపోయి, అఫ్గాన్ ఒక్క మ్యాచ్ గెలిచినా సెమీస్ వెళుతుంది. అప్పుడు అఫ్గానిస్తాన్ భారత్ సెమీస్ ప్రత్యర్థి అవుతుంది.